Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది.
ఏపీకి పొంచివున్న ముప్పు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..
ఏపీలో రానున్న మూడు రోజులు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుంది. పశ్చిమ మధ్య తీరానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో కూడా కురుస్తాయని చెబుతున్నారు.
వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..
వర్షాల ప్రభావంతో తీరం వెంబడి40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వేటకు వెల్లకూడదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణలో మరో మూడు రోజులు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశామున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే జగిత్యాల, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్ వంటి పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో అయితే కుత్బుల్లాపూర్, గాయత్రీనగర్, షాపూర్‌నగర్, లింగంపల్లిలో, అల్వాల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చౌటుప్పల్ వంటి ప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక..
జాగ్రత్తలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. బయటకు వెళ్లిన ప్రజలు తిరిగి ఇంటికి వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కావున బయటకు వెళ్లిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లిన ప్రజలు వర్షం తక్కువగా ఉన్నప్పుడే ఇంటికి చేరుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు అని చెబుతున్నారు.