Penna River: నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో ఇరుక్కుపోయిన ఇసుక తవ్వకాల బోట్లను అధికారులు ఎట్టకేలకు విజయవంతంగా వెలికితీశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా నదిలో ప్రవాహం ఉద్ధృతం కావడంతో.. నది ఒడ్డున ఉంచిన మూడు బోట్ల తాళ్లు తెగిపోయి కొట్టుకుపోయాయి. ఈ ఘటన పెన్నా వారధి సమీపంలో జరగింది. ఆ భారీ బోట్లు వంతెన గేట్లకు ఢీకొంటే పెను నష్టం వాటిల్లేదన్న ఆందోళనతో అధికారులు యుద్ధప్రాతిపదికన తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు.
పెన్నా నదిలో ఇసుక తవ్వకాల కోసం ఉపయోగించే ఈ బోట్లను రెండు రోజుల క్రితం నది ఒడ్డున అధికారులు భద్రపరిచారు. అయినప్పటికీ.. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ పెరిగిన ప్రవాహ వేగానికి బోట్లను కట్టి ఉంచిన తాళ్లు తెగిపోయాయి. దీంతో మొత్తం మూడు బోట్లు నదిలో కొట్టుకుపోవడం ప్రారంభించాయి. వాటిలో ఒకటి దాదాపు 35 టన్నుల బరువున్న భారీ బోటు కావడం గమనార్హం.
బోట్లు కొట్టుకుపోతున్న విషయాన్ని గుర్తించిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదిలో పెరిగిన ఉద్ధృతి దృష్ట్యా.. వాటిని సురక్షితంగా బయటకు తీయడం ఒక సవాలుగా మారింది. నిన్న రెండు చిన్న పడవలను ఒడ్డుకు తరలించడం సులభంగా మారింది. కానీ ఇవాళ 35 టన్నుల బరువున్న భారీ బోటును బయటకు తీయడం అత్యంత క్లిష్టంగా మారింది.
ALSO READ: Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు
ఇవాళ ఉదయం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆధునిక యంత్రాలు, ప్రత్యేక పరికరాల సహాయంతో భారీ బోటును సురక్షితంగా నది గట్టుకు చేర్చారు. ఈ భారీ బోటు నది ప్రవాహంలో అలాగే కిందకు వెళ్తే, అది నేరుగా పెన్నా వారధి గేట్లను ఢీకొనే అవకాశం ఉండేది. వారధి గేట్లు దెబ్బతింటే, భారీగా నీరు విడుదలయ్యి నది దిగువ ప్రాంతాలకు, చుట్టుపక్కల గ్రామాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేది. సకాలంలో అధికారులు స్పందించి, ఆ భారీ బోటును బయటకు తీయడంతో ఆ పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం తప్పడంతో అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘సకాలంలో సహాయక చర్యలు చేపట్టడం వల్లే పెను ప్రమాదాన్ని నివారించగలిగాం. భారీ బోటు వారధిని ఢీకొట్టి ఉంటే, ఆ నష్టం అంచనా వేయలేనిదిగా ఉండేది’ అని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇసుక తవ్వకాల బోట్ల భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు, బోట్లను తరలించే విషయంలో.. కట్టి ఉంచే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.