 
					Montha Effect: మొంథా తుపాను ఏపీని ముంచెత్తింది. భారీ స్థాయిలో నష్టాన్ని మిగిల్చి వెళ్లింది. ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్‌కు 5 వేల 625 కోట్ల మేర నష్టం కలిగినట్లు అంచనా వేశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రోడ్లు భవనాల శాఖకు 2 వేల 79 కోట్లు, వ్యవసాయ రంగానికి 829 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఆక్వారంగానికి 12 వందల 70 కోట్లు, మున్సిపల్ శాఖకు 109 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తేల్చిచెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
మొంథా తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. అవనిగడ్డ సహా పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కల్యాణ్..రైతులకు అండగా ఉంటామన్నారు.
మొంథా తుఫాను మిగిల్చిన కష్టాల నుంచి ప్రకాశం జిల్లా ప్రజలు ఇంత వరకు తేరుకోలేక పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వాగులు, నదులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఒంగోలు నగరం నుంచి కొత్త పట్నం మండలానికి సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొత్తపట్నం మండలంలోని సుమారు 20 గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. ఒంగోలు నుంచి కొత్త పట్నానికి వెళ్లే రహదారిలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయాయి. ముఖ్యంగా ఆక్వారంగం మీద భారీ ఎఫెక్ట్ పడ్డదని చెబుతున్నారు. అలాగే వ్యవసాయ రంగం మీద కూడా భారీ నష్టం జరిగింది. అయితే ఎక్కువగా వరి, మినుములు, పత్తి, మొక్కజొన్న వాటిపై ఎక్కువ నష్టం జరిగినట్లు సమాచారం తెలిపారు.
అలాగే తుఫాను దెబ్బకి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని లంక పొలాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రధానంగా చింతలంక, పెదలంక, సుగ్గన లంకల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. ఈదురు గాలులకు అరటి తోటలు దెబ్బతినడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు కన్నీరు పెడుతున్నారు. అంతేకాకుండా గుంటూరు, కృష్ణ జిల్లాల్లోని లంకల్లోని ప్రాంతాల్లో కూరగాయాల తోటలు బాగా డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. కనీసం కౌలు కూడా చెల్లించే పరిస్థితి లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పశు శాఖ, విద్యుత్ శాఖ వారు కూడా భారీ నష్టం జరిగినట్లు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో వ్యవసాయ రంగం మీద ఎంత నష్టం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా 5 వేల కోట్ల భారీ నష్టం జరిగినందున కేంద్రం సహాయం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Also Read: అణు పరీక్షలకు ట్రంప్ ఆర్డర్.. ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?
అంతేకాకుండా తుపాను కారణంగా ఏపీలోని 25 జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయాయన్నారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. 15 లక్షల ఎకరాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదన్నారు జగన్. ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు వై.ఎస్ జగన్.