Kodali Nani: ఏపీలో రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. పోలీసులు ఎప్పుడు, ఎవరికి నోటీసులు ఇస్తారోనన్న టెన్షన్ కొందరి నేతలను వెంటాడుతోంది. ఈ జాబితాలో చాలా మంది వైసీపీ ఫైర్‌బ్రాండ్ నేతలున్నాయి. కాకపోతే సందర్భాన్ని బట్టి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఊహించని షాక్ తగిలింది. ఆయన అనుచరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంతకీ ఏయే కేసులో తెలుసా?
కేసుల్లో విచారణ పర్వం
వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు, లిక్కర్ గోదాంపై దాడి కేసులో పోలీసులు కొడాలి నాని ముఖ్య అనుచరులకు 41 ఏ నోటీసులు ఇచ్చారు. వాటిని అందుకున్నారు కూడా. రేపో మాపో ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే గురువారమే నోటీసులు ఇచ్చారట. ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. నోటీసులు అందుకున్నవారిలో దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీను ఉన్నారు.
ఈ రెండు ఘటనల్లో కొడాలి నాని, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలతారెడ్డిలపై కేసులు నమోదయ్యాయి . నిందితులకు 41ఏ నోటీసులిచ్చి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో నిందితులకు పోలీసులు నోటీసులిచ్చారు.
గుడివాడ లిక్కర్ గోడౌన్‌కు సంబంధించి కేసు ఇది. గోడౌన్‌ను బలవంతంగా ఖాళీ చేయించారనే ఆరోపణలు కొడాలినానితోపాటు ఆయన అనుచరులపై కేసులున్నాయి. తనను బెదిరించి సరుకును ధ్వంసం చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే కేసులు నమోదు చేశారు. నిందితులుగా అప్పటి ఏపీ బెవరేజేస్ ఎండీ వాసుదేవరెడ్డి , జేసీ మాధవీలతరెడ్డి, కొడాలి నాని, ఆయన అనుచరులు గొర్ల శ్రీను, శశిభూషన్, రాంప్రసాద్ ఉన్నారు.
ALSO READ: వాట్సాప్ సర్వీసులు మరో మైలురాయి
అనుచరులను పోలీసులు విచారించిన తర్వాత కోడాలి నానికి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశమున్నట్లు కొందరు పోలీసులు చెబుతున్నారు. విచారణ సమయంలో మిగతావాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేస్తారా? లేదా అనేది చూడాలి.
పేర్నినానికి ఊరట
ఇదిలాఉండగా మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6గా ఆయన ఉన్నారు. మచిలీపట్నం రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు వ్యవహారంలో పేర్ని నానిపై ఆరోపణలు వినిపించాయి.
ఆయన కుటుంబానికి సంబంధించి మచిలీపట్నంలో గోదాముల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఆ గోదాము మేనేజర్ మానస్ తేజ బ్యాంక్ ఖాతాలో కోటికి పైగా నగదు లావాదేవీలను గుర్తించారు పోలీసులు. రేషన్ బియ్యం నిల్వలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ.
ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నానిపై తొందరపాటు చర్యలొద్దని పేర్కొంది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే పేర్ని నాని భార్య జయసుధ పేరుతో గోడౌన్ నిర్మించి సివిల్ సప్లయిస్‌కు అద్దెకు ఇచ్చారు. ఈ కేసులో గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్, కొంతమంది అరెస్టు అయ్యారు. 185 టన్నుల రేషన్ బియ్యం మాయం అయినట్లుగా గుర్తించారు అధికారులు. ఈ కేసు వెలుగులోకి రాగానే పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరిగింది.