Whatsapp Governance: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ విజయవంతంగా ప్రజలకు సేవలందిస్తోంది. దేశంలో తొలిసారిగా 161 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా ప్రారంభించారు. ‘మన మిత్ర’ పేరుతో 50 రోజుల్లోనే 200 సేవలు అందించే మైలురాయిని అందుకుంది. జనవరి 30న మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వాట్సాప్ సర్వీసుల్లో మైలురాయి
పది, ఇంటర్ విద్యార్థుల తమ హాల్ టిక్కెట్లను వాట్సాప్ ద్వారా పొందుతున్నారు. ప్రజలు వివిధ రకాల పౌర సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు. 9552300009 నెంబరుకు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా 200 రకాల పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.
విద్య, దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల వంటి సేవలు ఉన్నాయి. విద్యుత్తు బిల్లులు, పన్నుల చెల్లింపులు, దేవాలయాల్లో దర్శనాలు, వసతి గదుల బుకింగ్, విరాళాల సమర్పణకు ఉపయోగపడుతోంది.పర్యాటక ప్రదేశాల సమాచారం, టికెట్ బుకింగ్ వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుకోవచ్చు.
రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లను పొందొచ్చు.ప్రభుత్వం నుండి పౌరులకు, వ్యాపారం నుండి వినియోగదారునికి, ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి తొలి విడతలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో వ్యాపార రంగంలో సమర్థవంతమైన సర్వీస్ డెలివరీ కోసం రీ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా సర్వీసు అందుబాటులోకి వస్తాయి.
ALSO READ: విశాఖ-విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ ప్లాట్ ఫాంగా పలు రకాల సేవలను ప్రజలకు అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది అక్టోబర్ 22న డిల్లీలో మంత్రి లోకేష్-మెటా ప్రతినిధుల మధ్య ఒప్పందం జరిగింది.
టార్గెట్ 520
ప్రస్తుతం అందిస్తున్న సేవలను రాబోయే రోజుల్లో 520కి పైగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రియల్ టైమ్‌లో సేవలందించేలా చర్యలు తీసుకుంటోంది. జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఒకవేళ సర్టిఫికెట్‌లో తప్పులు ఉన్నా తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సేవలు అందిస్తోంది.
రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. పైన కనిపిస్తున్న వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. పేరు, ఫోన్ నంబర్, చిరునామా వివరాలు టైప్ చేయాలి. వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది.
దాని ఆధారంగా తమ సమస్య పరిష్కారం ఎంత వరకు అనేది తెలుసుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలను వాట్సప్ నంబరుకు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు.
రెండో విడతలో తితిదే దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇతర నంబర్ల ద్వారా సేవలు అందిస్తామని ఎవరైనా వస్తే చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నమ్మవద్దు చెబుతోంది. కొన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే చట్ట సవరణలు తప్పని అవసరం. మలి దశ సేవలకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.