Political Blamegame Amid Floods In AP: జనాలు జల విలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. తాగేందుకు నీళ్లు లేవు.. తినేందుకు తిండి లేదు. చుట్టూ నీరే.. ఇలాంటి సమయంలో ఏ రాజకీయ నేత అయినా ఆదుకోవాలని చూస్తారు. అండగా ఉండాలని చూస్తారు. అవసరమైతే చేతనైనంతా సాయం అందిస్తారు. కానీ ఏపీ డిఫరెంట్ కదా.. అక్కడి రాజకీయం, రాజకీయ నేతలు ఏ అంశంపై అయినా రాజకీయం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఏంటీ నమ్మడం లేదా? అయితే మీరే చూడండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచన చేయమని అడుగుతున్నారు. విజయవాడలో వచ్చినవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు.
ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టే పరిస్థితి ఇలా ఉందని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. ముందుస్తుగా అలర్ట్ చేయలేదు.. అదే తమ ప్రభుత్వంలో అయితే ఇలా ఉండేది కాదన్నారు. కాబట్టి.. రాజకీయాల్లో ఉన్నారు.. ప్రశ్నించడమే వారి పని.. మనం కూడా అర్థం చేసుకుందాం.. వదిలేద్దాం.. ఆయన ప్రజల్లోకి వచ్చి భరోసా కల్పించినందుకు ఆనందిద్దాం.. ఆయనకు సరైన కౌంటర్ వేసేందుకైనా కూటమి ప్రభుత్వం మరింత మంచిగా పనిచేయాలని కోరుకుందాం. కానీ జగన్ ఇలా మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. మరో మాట అనేశారు.. తెలిసి అన్నారో.. తెలియక అన్నారో కానీ అనేశారు.
కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటున్నారు జగన్.. నిజంగా బుడమేరు విజయవాడను ముంచేసింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ దానికి చంద్రబాబు నివాసానికి లింక్ ఏంటన్నది అర్థం కావడం లేదు. విజయవాడకు ఓ వైపు బుడమేరు ఉంది. మరోవైపు కృష్ణానది ఉంది. ఏ రకంగా చూసుకున్నా రెండింటికి సంబంధం లేదు. కానీ జగన్ మాత్రం అలా చెప్పేశారు. ఇది ఎలా ఉందంటే.. గతంలో ప్రకాశం బ్యారేజ్ గేట్‌కు బోట్‌ను అడ్డంగా పెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేయాలని చూస్తున్నారని టీడీపీ ఎంత లాజిక్ లేకుండా మాట్లాడిందో.. ఇప్పుడిది కూడా అంతే లాజిక్ లెస్‌గా ఉంది. కాబట్టి పరిస్థితి ఏదైనా ఈ నేతలకు రాజకీయం మాత్రమే కావాలి.. దాని తర్వాతే ఏదైనా..
Also Read: బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చలేకపోయాం: సీఎం చంద్రబాబు
నిజానికి విజయవాడ ఎందుకు మునిగింది? మొదటి కారణం.. మునుపెన్నడు లేని అతి భారీ వర్షాలు.. రెండవది.. అడ్డగోలు ఆక్రమణలు.. భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చగా.. బుడమేరు కన్నేర్ర చేసింది. దీంతో బెజవాడ బెంబేలెత్తింది. బుడమేరు ఏరియాలో చాలా ప్రాంతం ఆక్రమణకు గురైంది. బుడమేరు ప్రవాహం విజయవాడలోకి ఎంటర్ కాకుండా ఉండేందుకు కరకట్ట ఉండేది. ఉండేది.. ఇప్పుడు లేదు.. కనీసం దాని ఆనవాళ్లు కూడా లేవు. మొత్తం కాలనీలను విస్తరించారు. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఇందులో అన్ని పార్టీల వారు పాత్రధారులే.. దీనిపై మాత్రం ఏ పార్టీ ప్రశ్నించదు.. అసలు నోరే ఎత్తదు. ఎందుకంటే అన్ని పార్టీల వారికి నష్టమే కదా.
వీటితో పాటు విజయవాడ మునగడానికి మరో కారణం..బుడమేరుకు గండి పడటం.. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తడం.. ఎత్తితే దిగువ ప్రాంతాలకు నష్టం.. ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు నష్టం.. అసలు ప్రమాదం ఏంటంటే.. షట్టర్లు ఎత్తకపోతే కృష్ణ వరద వెనక్కి వెళుతుంది. అలా జరిగితే NTPS ప్లాంట్‌లోకి నీరు చేరే ప్రమాదం ఉంది. అందుకే షట్టర్లను ఎత్తారు.. దీంతో విజయవాడ కాస్త విలయవాడగా మారింది. సరే.. ప్రకృతి వైపరీత్యం జరిగింది. జనాల ఆక్రందన ఇంకా ఆగలేదు.అందుకే రెస్క్యూ టీమ్స్‌కు సరైన సహకారం అందించండి. మీ పబ్లిసిటీ స్టంట్స్ కొంచెం మానండి. ఈ అర్థం లేని రాజకీయాలకు ఇలాంటి సమయంలో అయినా కాస్త బ్రేక్ ఇవ్వండి. ఇదే ప్రజలు కోరుకునేది.