ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వతహాగా ఇతర మంత్రు శాఖల్లో కలుగజేసుకోవాలని అనుకోరు, తనకు కానీ, తన పార్టీ వాళ్లకు కానీ ఫలానా మంత్రిత్వ శాఖతో లేదా ఆ శాఖ అధికారులతో సమస్య ఉంటే.. వెంటనే మంత్రి దృష్టికి దాన్ని తీసుకెళ్తుంటారు. తాజాగా ఆయనకు పోలీస్ శాఖలో ఓ డీఎస్పీ వ్యవహారం నచ్చలేదు. భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారాలపై కొంతకాలంగా ఆయనకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఓ దశలో డిప్యూటీసీఎం ఆఫీస్ తరపున కూడా ఆయన పద్ధతి మార్చుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. కానీ జయసూర్య లైట్ తీసుకున్నారు. దీంతో నేరుగా పవన్ రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి ఎస్పీతో చర్చించి జయసూర్యపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అసలేం జరిగింది?
భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, కానీ డీఎస్పీ ఆ విషయాలను పట్టించుకోవట్లేదని స్థానిక జనసేన నేతలు పవన్ కల్యాణ్ కి ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాల్లో కూడా సదరు అధికారి జోక్యం చేసుకొంటున్నారని చెప్పారు. కొందరికి వత్తాసు పలుకుతూ, అదేమంటే కూటమి నేతల పేరు వాడుతున్నారని తెలుస్తోంది. దీంతో స్థానిక జనసేన నేతలు నేరుగా ఆయనకు సలహాలిచ్చారు. ఆయన పట్టించుకోలేదు. తమ స్థాయిలో పని జరగకపోయే సరికి, వారు నేరుగా పవన్ కల్యాణ్ ని కలసి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి పవన్..
స్థానిక నేతలు వరుసగా ఫిర్యాదులు చేయడంతో పవన్ రంగంలోకి దిగారు. అయితే ఆయన నేరుగా సదరు వివాదాస్పద డీఎస్పీకి ఫోన్ చేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని చెప్పారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉంటున్నారని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని అన్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని ఎస్పీకి సూచించారు. ప్రజలందరినీ ఒకే దృష్టితో చూడాలని, శాంతిభద్రతలను పరిరక్షించాలని చెప్పారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర డీజీపీకి కూడా ఈ విషయాలు తెలియజేయాలని కార్యాలయ అధికారులను ఆదేశించారు.
భీమవరం డిఎస్పీ శ్రీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో చర్చించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డి.ఎస్.పి. శ్రీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డి.ఎస్.పి. పరిధిలో పేకాట శిబిరాలు…
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2025
డీజీపీ నివేదిక కోరిన డిప్యూటీ సీఎం
తాజాగా జూద కేంద్రాలు, గేమింగ్ యాక్ట్ వ్యవహారాలపై ఏపీ డీజీపీని డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ నివేదిక కోరడం విశేషం. ఏపీలో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో అయినా.. వీటిని నిర్వహించడం, వీటిలో పాల్గొనడం చట్ట విరుద్ధం. ఏపీ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం అలా చేసిన వారు శిక్షార్హులు. అయితే రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు కొనసాగుతున్నాయని, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు పలు ఫిర్యాదులు అందాయి. భీమవరంతోపాటు, ఇతర ప్రాంతాలనుంచి కూడా ఫిర్యాదులు అందడంతో ఆయన నేరుగా డీజీపీని వివరణ కోరారు. ఇలాంటి ఫిర్యాదులు పోలీసుల దృష్టికి వస్తే, వాటిపై తీసుకున్న చర్యలేంటి? అనే సమాచారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివేదిక రూపంలో కోరడం విశేషం.
Also Read: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు