ఉత్తరాంధ్రకు రాజధాని ఇస్తానంటూ ఊరించిన జగన్ చివరకు ఉసూరుమనిపించి రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. అటు అమరావతి ప్రాంతంలో వైసీపీకి మెజార్టీ రాలేదు, ఇటు ఉత్తరాంధ్ర కూడా షాకిచ్చింది. అయితే కేవలం అమరావతిని నమ్ముకున్న టీడీపీ ఎన్నికల్లో గెలిచాక మాత్రం ఉత్తరాంధ్రకు ఎక్కడలేని ప్రయారిటీ ఇస్తోంది. ఇటు రాజధాని అమరావతిని పూర్తి చేస్తూనే అటు ఆల్రడీ మౌలిక వసతులు ఉన్న విశాఖకు కూాడ కంపెనీలను తరలిస్తోంది. ఇటీవల విశాఖకు వచ్చిన, వస్తున్న కంపెనీలు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ సాగర తీరానికి మణిహారంలో మారబోతోంది. ఇక విజయనగరం జిల్లాలో వస్తున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తయి విమాన సేవలు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదనే చెప్పాలి.
వచ్చే ఏడాది ప్రారంభం..
ఉత్తరాంధ్రకు కీలకంగా మారబోతున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ పనుల్ని 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే టీడీపీ మొదలు పెట్టింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో పనులు నత్తనడకన నడిచాయి. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ నాటికి ఈ ఎయిర్ పోర్ట్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా ఎయిర్ పోర్ట్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, ఉత్తరాంధ్రకే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కీలకంగా మారుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు కూడా భోగాపురంలో వస్తున్న అల్లూరు సీతారామరాజు ఎయిర్ పోర్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
భోగాపురం ప్రత్యేకతలు..
3.8 కిలోమీటర్ల అతి పెద్ద రన్ వే ఈ ఎయిర్ పోర్ట్ సొంతం. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ఇప్పటికే 85 శాతం పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనుల్ని త్వరలో పూర్తి చేసి ఆగస్ట్ 2026 నాటికి దీన్ని ప్రారంభించాలనే ప్రణాళికతో అధికారులు ముందుకెళ్తున్నారు. పౌర విమానయాన శాఖ సహాయమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్, భోగాపురం…
3.8 కిలోమీటర్ల అతి పెద్ద రన్ వేతో దేశంలోనే అధునాతమైన అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు 85 శాతం పైగా పూర్తి అయ్యాయి. చంద్రబాబు గారి టార్గెట్ ప్రకారం 2026 ఆగష్టు నాటికి ప్రారంభించే దిశగా పనులు సాగుతున్నాయి.… pic.twitter.com/TtJbRRXtVD
— Telugu Desam Party (@JaiTDP) October 21, 2025
Also Read: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?
ఏపీ ప్రజలు రాజధానికోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో, తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని, తమ ప్రాంతంలోనే తమకు ఉద్యోగ అవకాశాలు రావాలని అంతే ఆశగా ఉన్నారు. ఈ ఆశను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. ఉత్తరాంధ్రకు కీలక పరిశ్రమలు తరలిస్తోంది. వైజాగ్ ని ఐటీ హబ్ గా మారుస్తోంది. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం దానికి తగ్గ కసరత్తులు చేస్తోంది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినా గత వైసీపీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనే విమర్శలున్నాయి. కూటమి మాత్రం విశాఖ విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. మొత్తం ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికల్లో ఆ అభివృద్ధిని చూపించే ఓట్లు అడగాలని భావిస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ సహా, ఇతర ప్రాజెక్ట్ లు, అభివృద్ధి పథకాలు పూర్తయితే ఉత్తరాంధ్రలో కూటమికి తిరుగుండదనే చెప్పాలి.
Also Read: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!