Political Movies Before Elections(Andhra politics news): ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా పొలిటికల్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇది గతంలోనూ జరిగింది. ఇప్పుడూ అదే రిపీట్ అవుతోంది. వెండితెరపై ప్రేక్షకులను అలరించడం, బాక్సాఫీసులు బద్దలవడం అన్న మాట అటుంచితే.. పొలిటికల్ రివేంజ్ ల కోసమే ఈ సినిమాలను జనంపైకి వదులుతున్నారన్న టాక్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మరికొన్ని రాబోతున్నాయి. అన్నీ కోర్టులు, సెన్సార్ బోర్డుల వివాదాలు దాటుకుని రావాల్సిన పరిస్థితి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వరుసబెట్టి రాజకీయ సినిమాలు జనం ముందుకు వచ్చేస్తున్నాయి. సంక్రాంతి పండగకు సినిమాలకు క్రేజ్ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం ఎలక్షన్ల ముందు పొలిటికల్ రివేంజ్ లతో సినిమాలు రావడం కూడా కామన్ గా మారుతోంది. టీడీపీ, వైసీపీ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు వెండితెరపై దర్శనమిస్తున్నాయి. ఒకర్ని టార్గెట్ చేస్తూ మరొకరు ముందస్తుగానే సినిమాలు ప్లాన్ చేసుకోవడం, ఎలక్షన్ తేదీ దగ్గరపడే సమయంలో రిలీజ్ చేయడం కామన్ గా జరుగుతున్నదే.
Read More : వైసీపీకి భారీ షాక్.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా!
ఏపీలో పొలిటికల్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసే పరిస్థితి అసలే లేదన్నది గత ఫలితాలు చూస్తేనే అర్థమవుతుంది. ఆత్మ స్తుతి, పరనింద అన్నట్లుగా ఈ సినిమాలు సాగుతుంటాయి. దీంతో పార్టీలను విపరీతంగా అభిమానించే వారినే ఇవి అలరిస్తాయి. న్యూట్రల్ ప్రేక్షకుల సంగతి చెప్పక్కర్లేదు. అయినా సరే.. ఎన్నికల ముందు ఇదొక అస్త్రంగా ప్రధాన పార్టీలు వాడుకుంటున్నాయి. ఎలక్షన్ల ముందు హాట్ డిబేట్ కావాలి అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రేక్షకులపై వదులుతున్న సినిమాలు కూడా అలాంటివే.
సరిగ్గా ఎన్నికల ముందు రిలీజ్ చేసుకునేలా పొలిటికల్ సినిమాలకు ప్లాన్ జరుగుతుంటుంది. రాజకీయ ఎజెండాతో తీసిన వ్యూహం, శపథం సినిమాలను మార్చి 1, మార్చి 8న రిలీజ్ చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలు కోర్టు కేసులు, వివాదాలు, చిక్కుముడులను దాటుకుని విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండూ వైసీపీకి అనుకూలంగా నిర్మించినవే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజధాని ఫైల్స్ అమరావతి రైతుల కష్టనష్టాలను బేస్ చేసుకుని తీశారు. వైసీపీ గవర్నమెంట్ టార్గెట్ గా ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ను కోటీ 45 లక్షల మంది చూశారు.
Read More : మేనిఫెస్టోపై వైసీపీ కసరత్తు.. అదే బ్రహ్మాస్త్రమవుతుందా ?
సోషల్ మీడియాలో వ్యూస్ వేరు, థియేటర్లలో హౌజ్ ఫుల్ అవడం వేరు. వెండితెరపై మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదల ఆపేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రిలీజ్ కు ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ సినిమా తీశారని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ సినిమాలో సీఎం జగన్, కొడాలి నాని, తదితరుల్ని పోలిన పాత్రలున్నాయని.. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ని రద్దు చేయాలన్నారు. కానీ కోర్టు వివాదాల తర్వాత రాజధాని ఫైల్స్ జనం ముందుకు వచ్చేసింది.
ఇప్పటికే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. అందులో ఒకటి యాత్ర 2. యాత్ర మూవీకి కొనసాగింపుగా ఇది వచ్చింది. పోయింది కూడా. 2019లో వచ్చిన యాత్ర సినిమా వైఎస్ అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పించింది. మహి.వి.రాఘవ్ తీసిన సినిమా కావడంతో దీనిపై కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు యాత్ర 2 వచ్చింది. అయితే దీని ఎఫెక్ట్ కొంత వరకే పరిమితం అయిందన్న టాక్ తెచ్చుకుంది. అటు జగన్ టార్గెట్ గా వచ్చిన రాజధాని ఫైల్స్ కూడా ట్రైలర్ వరకు ఆకట్టుకుంది. సో రెండు సినిమాల కథ ముగిసింది. ఇక వర్మ దర్శకత్వంలో వ్యూహం, శపథం టీడీపీ శిబిరంపై ఎటాక్ కు రెడీగా ఉన్నాయి. కోట్లు పెట్టి తీసినా ప్రజలను ఇలాంటి సినిమాలు ఏమేరకు ఆకట్టుకుంటాయన్నది పెద్ద మ్యాటర్ కాదు. ఎలక్షన్ ముందు బొమ్మ పడిందా లేదా అన్నదే ముఖ్యం.
Read More :వివాదాల నడుమ వచ్చిన “రాజధాని ఫైల్స్”.. ఎలా ఉందంటే ?
వ్యూహం సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును అభ్యంతరకరంగా చూపారని, ఈ మూవీ విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. అయితే, తొలుత వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికేట్‍ను కోర్టు రద్దు చేసింది. దీంతో దర్శక నిర్మాతలు డివిజన్ బెంచ్‍కు అప్పీల్ చేశారు. రెండోసారి సెన్సార్ తర్వాత వ్యూహం సినిమా రిలీజ్‍కు డివిజన్ బెంచ్ అంగీకరించింది. దీంతో ఈ చిత్రం రిలీజ్ కు రూట్ క్లియర్ అయింది. అయితే వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి ఈ రెండు సినిమాలు. తాజాగా టెక్నికల్ ప్రాబ్లమ్ అని, ఫిబ్రవరి 23న తొమ్మిది సినిమాలు రిలీజ్ ఉండడంతో వారం వాయిదా వేశామని వర్మ చెప్పుకొచ్చారు.
వ్యూహం, శపథం సినిమాలపై ఒకే ట్రైలర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు ఆర్జీవీ. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలను వ్యూహం మూవీలో ఆర్జీవీ చూపించబోతున్నారు. 2019 తర్వాతి పరిస్థితులను శపథంలో చూపిస్తానని ఇది వరకే ప్రకటించారు. జగన్ ఆలోచన విధానం నచ్చడంతోనే.. ఆయనపై సినిమాలు తీస్తున్నానని రాంగోపాల్ వర్మ అప్పట్లో చెప్పుకొచ్చారు. వ్యూహంలో కీలక రాజకీయ నాయకుల పాత్రలుంటాయని… చంద్రబాబు అరెస్టు, వివేకా హత్య సన్నివేశాలు ఉంటాయన్నారు. వ్యూహంకి కొనసాగింపుగా శపథం నిర్మిస్తున్నామని వర్మ చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ సినిమాలపై తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీవీ అవాస్తవాలను.. కించపరిచేలా పాత్రలను చూపిస్తున్నారని ఆరోపించారు. అయినా అన్ని చిక్కులు దాటుకుని రిలీజ్ కు రెడీ అయ్యాయి. రాజకీయ ప్రతీకారాలను జనంపై సినిమాల రూపంలో రుద్దడం కొత్త కాకపోయినా ఇప్పటికైతే హాట్ డిబేట్ అవుతోంది. పొలిటికల్ సినిమాలు వర్కవుట్ అవుతాయా అవవా అన్నది పక్కన పెడితే ఇప్పటికిప్పుడు మాత్రం కొంత వరకైనా ఓటర్ల దృష్టిని మార్చకపోతాయా అన్న నమ్మకంతో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మరి రాజధాని ఫైల్స్, వ్యూహం, శపథం వంటివి పోలింగ్ సరళిని ఏమేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.