TDP-Janasena Candidates First List Released: ప్పుడెప్పుడా అని టీడీపీ, జనసేన అభిమానులు ఎదురుచూస్తున్న తొలిజాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు మాఘపూర్ణిమ సందర్భంగా రెండు పార్టీల అధినేతల భేటీ ప్రస్తుతం జరుగుతోంది. నేటి ఉదయం 11.40 నుంచి 11.47 గంటల మధ్య ముహూర్తం బాగుందని పండితులు చెప్పడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడిగా తొలి జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో బాటు బీజేపీ కూడా కూటమిలో మిత్రపక్షంగా ఉండనుందనీ, మరోవారంలో ఆ పార్టీకి కేటాయించే సీట్ల విషయంలోనూ స్పష్టత రానుందని తెలుస్తోంది. దీంతో పాటు.. కొందరు లోక్‌సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కాగా.. నేటి తొలి జాబితాలో 65 మంది వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ జాబితాలో టీడీపీ నుంచి 50-52 మంది, జనసేన నుంచి 15 మంది పేర్లు ఉండొచ్చు. త్వరలోనే రెండవ జాబితా సిద్ధంచేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఇరుపార్టీల నేతలు వెల్లడిస్తున్నారు. మరోవైపు.. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. అలాగే ఈనెల 26న వైసీపీ ఎంపీ లావు, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, పార్థసారథి ,వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా సైకిలెక్కనున్నారు.
వైసీపీని ఎదుర్కొనే అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్ధులనే ఎంపిక జరిగిందని, ఇందుకు తోడు సర్వేలనూ పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఇరు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం లేని నియోజకవర్గాలకు సంబంధించి, అభ్యర్ధులను ముందు ప్రకటిస్తే వారు వేగంగా జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని ఇరుపార్టీలు అంచనా వేస్తున్నాయి. ఒకే నియోజకవర్గంలో ఇరు పార్టీలు పోటీపడుతున్న చోట.. మరోసారి సర్వే చేసి రెండవజాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ-జనసేన నాయకత్వాలు, తాము వివిధ సంస్థలతో చేయించుకున్న సర్వే నివేదికలను ముందు పెట్టుకుని.. చర్చల్లో నియోజకర్గాలు, అభ్యర్ధుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, లోకేష్ మంగళగిరి నుంచి, పవన్ కల్యాణ్ భీమవరం నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి, పార్టీనే నమ్ముకున్న నేతలందరికీ టికెట్ కన్ఫామ్ అని కూడా వార్తలు వస్తున్నాయి.