Heavy Rains Alert: వేసవి తీవ్రత మధ్యలో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత వాతావరణశాఖ (IMD) గురువారం దేశంలోని 15 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో మేఘగర్జనలు, ఉరుములు, పెనుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఎల్లప్పుడూ వరదల ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల వల్ల రహదారులు, రైలు మార్గాలు, విద్యుత్ సరఫరా వంటి సేవల్లో అంతరాయం కలగవచ్చని సూచనలతో పాటు ప్రజలు అప్రమత్తంగా హెచ్చరికలు జారీ అయ్యాయి.
భారీ వర్షాల హెచ్చరికలు.. ఈ రాష్ట్రాలకే
అసోం, మేఘాలయ, అండమాన్ & నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి
ఈ రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ బులెటిన్లను గమనించాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా చల్లని గాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉండటం వల్ల బయటకు వెళ్ళే వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
వడగాలుల హెచ్చరికలు..
ఇది మాత్రమే కాదు, ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో వడగాలులతో కూడిన ఉరుముల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టంచేసింది. ఈ ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఎండ తీవ్రంగా ఉండటంతో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు.
వర్షం లేదా గాలుల సమయంలో చెట్లు, బోర్లు, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదు. ప్రయాణాలు చేపట్టే ముందు వాతావరణ సూచనలపై అవగాహన కలిగి ఉండాలి. తక్కువ ఎత్తున ఉన్న ప్రాంతాల్లో నీటి నిల్వ ఉండే అవకాశం ఉన్నందున రహదారి మార్గాలను పరిశీలించాలి. ఈ వర్షాలు ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చునన్న ఆశను కలిగిస్తున్నా, మరొకవైపు సాధారణ జీవనవిధానంపై ప్రభావం చూపే అవకాశాన్ని కూడా విస్మరించరాదన్నారు. అందువల్ల ప్రజలు వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
పిడుగులు పడే సమయంలో.. జాగ్రత్తలు
వర్షాకాలంలో పిడుగులు సాధారణమే అయినా, అవి ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఓపెన్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిడుగు పడే సూచనలు కనిపించిన వెంటనే భద్రమైన ఇంటి లోపలికి వెళ్లాలి. చెట్ల కింద నిలబడకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా దూరంగా ఉంచాలి. లోహ వస్తువులను తాకడం, నీటిలో ఉండడం, ఎత్తైన ప్రదేశాల్లో ఉండటం అత్యంత ప్రమాదకరం.
విద్యుత్ తీగలు, ఫెన్సింగ్ తాళాలు, సైకిళ్లు, బైకులు వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. పిడుగుల సమయాల్లో ప్రభుత్వ సంస్థలు పంపే హెచ్చరికలు గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు.