Northeast India Tour: ఇండియాకు ఈశాన్య ప్రాంతం (నార్త్ ఈస్ట్ ఇండియా) ఒక మణిహారం లాంటిది. సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర వంటి ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవు. ఎత్తైన హిమాలయ పర్వతాలు, పచ్చని లోయలు, ఉరకలేసే జలపాతాలు, అరుదైన వన్యప్రాణులతో ఈ ప్రాంతాలు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాలను జీవితంలో ఒక్కసారైనా చూడాలి. నార్డ్ ఈస్ట్ ఇండియాలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అస్సాం:
అస్సాం అంటే గుర్తుకొచ్చేది మొదట కాజీరంగా నేషనల్ పార్క్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కాజీరంగా, ప్రపంచంలోనే అత్యధికంగా అంతరించిపోతున్న ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడ ఏనుగు సఫారీ, జీప్ సఫారీలతో అడవి అందాలను ఆస్వాదించవచ్చు. మరో అద్భుతం మజూలి. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. అస్సామీ సంస్కృతి, కళలకు మజూలి కేంద్రంగా ఉంది. చేనేత వస్త్రాలు, సాంప్రదాయ ‘సత్రాస్’ (మఠాలు) తప్పకుండా చూడాలి.
మేఘాలయ:
‘మేఘాల నివాసం’ అని పిలిచే మేఘాలయ ప్రకృతి ప్రేమికులకు అంతే కాకుండా సాహసయాత్రికులకు అద్భుతమైన ప్రదేశం. ఈ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ ‘తూర్పు స్కాట్లాండ్’గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలైన చిరపుంజి, మాసిన్‌రామ్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ భారీ జలపాతాలు, లోతైన లోయలు, దట్టమైన అడవులు ఉన్నాయి. మేఘాలయ యొక్క ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. ఇక్కడి గిరిజనులు వేళ్ళతో నిర్మించిన లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు. చిరపుంజి సమీపంలోని మౌలిన్‌నాంగ్ గ్రామం ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా పేరు గాంచింది.
అరుణాచల్ ప్రదేశ్: (ఉదయించే సూర్యుని భూమి)
చైనాతో సరిహద్దులో ఉన్న తవాంగ్ ప్రశాంతమైన వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న తవాంగ్ మొనాస్టరీ దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మఠాలలో ఒకటి. బౌద్ధ సంస్కృతి, ఆధ్యాత్మికతను ఇక్కడ అనుభూతి చెందవచ్చు. ట్రెక్కింగ్, హైకింగ్ చేయాలనుకునేవారికి తవాంగ్ ఒక గొప్ప గమ్యస్థానం. అలాగే.. అద్భుతమైన పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన జిరో లోయ (Ziro Valley) కూడా తప్పక చూడాల్సిన ప్రదేశం.
Also Read: వీళ్లు.. దానిమ్మ అస్సలు తినకూడదు తెలుసా ?
సిక్కిం: (హిమాలయాల ఒడి)
దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రాలలో సిక్కిం ఒకటి. ముఖ్యంగా రాజధాని గ్యాంగ్‌టక్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తైన పర్వతాలు, బౌద్ధ మఠాలు , పూల తోటలు ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ నుంచి కంచనగంగ పర్వత శిఖరాన్ని చూడడం ఒక మరపురాని అనుభూతి. నాథు లా పాస్, త్సోమ్‌గో సరస్సు సిక్కిం ట్రిప్‌లో ప్రత్యేక ఆకర్షణలు.
ఈశాన్య భారతదేశం అనేది కేవలం పర్యాటక ప్రాంతం కాదు. అది ఒక సంస్కృతుల కలయిక. ఇక్కడ ఉన్న ప్రతి రాష్ట్రం దాని ప్రత్యేకమైన గిరిజన సంస్కృతి, అద్భుతమైన ఆహారం, సాహసోపేతమైన ప్రదేశాలతో సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ సారి నార్త్ ఈస్ట్ ఇండియా టూర్ ప్లాన్ చేయండి.