Ramakrishna Reddy: కడప వేదికగా మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLS) పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఆయన ప్రకటించారు. రాయలసీమ ప్రాజెక్టు 90 శాతం పూర్తయినప్పటికీ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావాలనే దానిని పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన సొంత ప్రాధాన్యతల కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని.. ఇది కేవలం ఈ ప్రాంత సమస్యే కాదని, యావత్ రాష్ట్ర రైతాంగ సమస్య అని సజ్జల పేర్కొన్నారు.
మరోవైపు, ఎగువన కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నీటి లభ్యత కరువవుతుందని దీనిపై చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. పక్క రాష్ట్రం చేస్తున్న ఈ అక్రమ ప్రయత్నాలపై కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.
ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాముఖ్యతపై గ్రామ గ్రామాన ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని సజ్జల పిలుపునిచ్చారు. ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాలని, కూటమి నాయకులపై ఒత్తిడి పెంచాలని సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ పోరాటంలో పాల్గొంటారని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన స్పష్టం చేశారు.