Idli Tikka Recipe Telugu: సౌత్ ఇండియాలో ఇడ్లీ, సాంబార్ అంటే తెలియని వారుండరు. అయితే ప్రతిరోజూ ఒకేలాంటి ఇడ్లీ తింటే బోర్ కొట్టడం సహజం. అలాంటి సమయంలో ఇడ్లీకి కొంచెం మసాలా అద్ది, ‘టిక్కా’ లాగా వేయిస్తే ఆ రుచే వేరు. దీనికి తోడు వేడివేడి సాంబార్ ఉంటే.. ఆ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం పూట స్నాక్స్‌లా లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లా ఇది చాలా బాగుంటుంది. చాలా తక్కువ నూనెతో.. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ టేస్టీ ఇడ్లీ టిక్కా విత్ సాంబార్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇడ్లీ టిక్కా విత్ సాంబార్ తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు:
ఇడ్లీలు: 6-8
పెరుగు: 1/2 కప్పు
మసాలాలు: కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా (అన్నీ అర చెంచా ).
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 చెంచా.
కూరగాయలు: ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు .
నూనె: తగినంత.
తయారీ విధానం:
1. ఒక బౌల్‌లో పెరుగు తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.
2. ఈ మిశ్రమంలో కోసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి మసాలా అంతా పట్టేలా కలపాలి. దీనిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి .
3. ఇప్పుడు ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. మారినేట్ చేసిన ఇడ్లీ ముక్కలను, కూరగాయ ముక్కలను పాన్‌పై వేసి అన్ని వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించాలి.
4. మీకు కావాలంటే వీటిని టూత్‌పిక్స్‌కు గుచ్చి కూడా ఫ్రై చేసుకోవచ్చు. పైన కొంచెం నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే ఇడ్లీ టిక్కా రెడీ.
హోటల్ స్టైల్ సాంబార్ తయారీ:
కావాల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1 కప్పు
చింతపండు రసం: కాస్త
కూరగాయలు: మునక్కాయలు, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి.
సాంబార్ పొడి: 2 చెంచాలు.
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ.
Also Read: నోరూరించే పంజాబీ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే సింపుల్‌గా రెడీ చేయండిలా!
తయారీ ప్రాసెస్:
1.ముందుగా ఒక గిన్నెలో కూరగాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో ఉడికించాలి.
2.కూరగాయలు సగం ఉడికాక అందులో చింతపండు రసం, సాంబార్ పొడి వేసి మరగనివ్వాలి.
3.ఇప్పుడు ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి బాగా కలపాలి. సాంబార్ చిక్కగా ఉంటే మరికొన్ని నీళ్లు పోయాలి.
4. సాంబార్ మరుగుతున్నప్పుడు ఉప్పు చెక్ చేసుకుని సరిచేయాలి.
5. చివరగా వేరే చిన్న పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఈ పోపును సాంబార్‌లో కలిపి, కొంచెం కొత్తిమీర చల్లితే వేడివేడి సాంబార్ సిద్ధం.