ఏపీలో ప్రస్తుతం మెడికల్ కాలేజీల వ్యవహారంపై పొలిటికల్ వార్ జరుగుతోంది. అత్యధిక మెడికల్ కాలేజీలు మా హయాంలో వచ్చాయంటే, లేదు మా హయాంలోనే వచ్చాయంటూ టీడీపీ, వైసీపీ పోటా పోటీగా చెప్పుకుంటున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత మాదేనంటూ జగన్ చెబుతున్నారు, వైసీపీ హయాంలో కట్టింది కేవలం మొండిగోడలేనంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సోషల్ మీడియా కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. ఈ అటాక్ తో వైసీపీ సైలెంట్ అవుతుందని అంటోంది.
ఆ రెండిటి మధ్య పోలిక..
విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది, అదే విజయనగరంలో వైసీపీ ఆఫీస్ ఇలా తళతళలాడిపోతోంది. అంటూ రెండు భవనాల ఫొటోలను పక్క పక్కన పెట్టి టీడీపీ ఓ టెంప్లేట్ చేసింది. ఏలూరు, రాజమండ్రి, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీల ఫొటోలు ఓవైపు, మరోవైపు అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయాల ఫొటోలు జోడించింది. ఈ ఫొటోలు చూస్తే జగన్ ఏచేశారనేది ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమవుతుందని అంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
మెడికల్ కాలేజీల పేరుతో 4,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన జగన్… ఆ నిధులతో 26 జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకున్నాడు. 17 మెడికల్ కాలేజీలు కట్టేశా అంటున్న జగన్ కట్టిన మెడికల్ కాలేజీల పరిస్థితి చూడండి. అదే జిల్లాలో జగన్ కట్టించిన వైసీపీ పార్టీ ఆఫీసుల హంగులు చూడండి. వీటికోసం… pic.twitter.com/BUi1kG75SO
— Telugu Desam Party (@JaiTDP) September 16, 2025
నిధులు పక్కదారి..
మెడికల్ కాలేజీల పేరుతో 4,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన జగన్, ఆ నిధుల్ని పక్కదారి పట్టించారని, 26 జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీసులను అందంగా కట్టుకున్నారని టీడీపీ అంటోంది. 17 మెడికల్ కాలేజీలు కట్టేశానంటున్న జగన్, వాటి పరిస్థితి ఒక్కసారి చూడాలని చెప్పింది. మెడికల్ కాలేజీల పరిస్థితి చూడండి – అదే జిల్లాలో జగన్ కట్టించిన వైసీపీ పార్టీ ఆఫీసుల హంగులు చూడండి. అంటూ ఫొటోలు విడుదల చేసింది. పార్టీ ఆఫీస్ ల కోసం రూ.500 కోట్ల ప్రజాధనాన్ని, రూ.688 కోట్ల ప్రభుత్వ భూములని జగన్ మింగేశారని ఆరోపించింది టీడీపీ. మెడికల్ కాలేజీలు కట్టామని చెబుతున్న జగన్, ఒక్కచోట అయినా పూర్తయిన భవనాన్ని చూపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కేవలం తమ పార్టీ ఆఫీస్ ల నిర్మాణంపై జగన్ శ్రద్ధ పెట్టారని, అదే శ్రద్ధ మెడికల్ కాలేజీల నిర్మాణంపై పెట్టి ఉంటే ఫలితం ఉండేదని టీడీపీ ఎద్దేవా చేస్తోంది.
నిర్ణయం ప్రజలదే..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకో పార్టీ ఆఫీస్ ని ఘనంగా ప్రారంభించుకున్నారు. అప్పట్లోనే టీడీపీ ఈ భవనాలపై ఆరోపణలు చేసింది. ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీస్ లు కట్టుకున్నారని విమర్శించింది. తాజాగా ఈ భవనాలు మరోసారి హైలైట్ అయ్యాయి. మెడికల్ కాలేజీలు కట్టకుండా ఏమార్చిన జగన్, పార్టీ ఆఫీస్ లు ఘనంగా నిర్మించుకున్నారని టీడీపీ మరోసారి ఆరోపిస్తోంది. అలాంటి జగన్ మెడికల్ కాలేజీల విషయంలో టీడీపీని నిందించడం ఎంతమేరకు సబబు అని ప్రశ్నిస్తోంది. టీడీపీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఏయే ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం ఎంతవరకు జరిగింది, అదే ప్రాంతాల్లో వైసీపీ హయాంలో ఆ పార్టీ ఆఫీస్ ల నిర్మాణం ఎంత బాగా జరిగిందనేది ప్రజలే ఆలోచించుకునేలా చేశామంటున్నారు టీడీపీ నేతలు.