AP Heavy Rains: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ అనుకూల పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం సాయంత్రం నెల్లూరు, తిరుపతి జిల్లాల తీర ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తాయి. అలాగే మధ్య ఆంధ్రలో సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఒంగోలు, మచిలీపట్నం, అమలాపురం, కాకినాడలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అక్టోబర్ 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అక్టోబర్ 26న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో శనివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల
రేపు(ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్ , హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట , జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.