Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, ఆ స్థాయికి చేరుకొనేందుకు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. దేశ రాజకీయాలు ఒక్కసారిగా తనవైపు చూసేలా, 2024 ఎన్నికల్లో అలా ఫలితాలు సాధించారు పవన్. అలా పవన్ క్రేజ్ ఇప్పుడు జాతీయ స్థాయికి చేరుకోగా, ఆ స్థాయికి వెళ్లేందుకు ఒక్క పుస్తకం చదివారట పవన్. అసలు ఆ పుస్తకంలో ఏముంది? పవన్ కు సక్సెస్ మంత్రం భోదించిన ఆ పుస్తకం ఎక్కడ?
పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’ అనే డైలాగ్ వినే ఉంటారు. అలా తగ్గాడు ఇలా నెగ్గాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే దక్కించుకోవాలన్న నానుడి కూడా పవన్ కు కరెక్ట్ గా సూటవుతుంది. అందుకే కాబోలు సినిమా రంగంలో సక్సెస్, రాజకీయ రంగంలో కూడా సక్సెస్ సాధించి నేడు దేశ రాజకీయాలకు దిక్సూచిగా మారారు పవన్ కళ్యాణ్.
ఏపీ స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్య్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంతో సాధించాలన్న తపన ఉండేదని, చాలా నేర్చుకోవాలని ఎప్పుడూ భావించేవాడినన్నారు. తాను ఒక పుస్తకం చదివిన సమయంలో ఒక పేజీ జీవితాన్ని మార్చేసిందని చెప్పారు.
ఆ పేజీలో 10, 20 సంవత్సరాల తరువాత నువ్వు ఎలా ఉండాలనేది ముందుగా రాసుకోమని.. అందులో పెద్ద నటుడిని అవ్వాలనో, పారిశ్రామిక వేత్త అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదం అనిపించినా అది ఒక దిక్సూచిలా అనిపించిందన్నారు. నేడు తాను రాజకీయాల్లోకి వచ్చి, సక్సెస్ సాధించానంటే ఆ పుస్తక ప్రభావం తనపై ఉందని పవన్ అన్నారు. అలాగే మన రాష్ట్రం 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు విజన్ కూడా ఆ పుస్తకంలా గొప్పదంటూ కొనియాడారు.
సీఎం చంద్రబాబు గురించి పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబు తన కోసం కలలు కనలేదని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కోసం కలలు కన్న మహా నాయకుడిగా సంభోధించారు. చిన్న పిల్లలు భవిష్యత్తులో ఇది అవుతానన్నప్పుడు హాస్యాస్పదంగా ఉండొచ్చు. కాలానికి ముందుకెళ్ళి చూస్తే వారు సాధించిన తరువాత ఈ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థం అవుతుంది. 2020 విజన్ స్టేట్మెంట్ బాబు ఇచ్చినప్పుడు అదే మాదాపూర్ లో మేము రాళ్ళు రప్పలు చూస్తే, సైబర్ సిటీని ఆయన చూశారన్నారు.
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు గుర్తు లేరు కానీ నిర్మాణం గుర్తుండిపోయింది. ఈ రోజు అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన సైబర్ సిటీ కానీ, ఒచ్చిన బిల్డింగులు కానీ, అవకాశాలకు రూపకర్త చంద్రబాబు అంటూ పవన్ కొనియాడారు. దశాబ్దాల సుధీర్ఘ అనుభవం, నాయకత్వ లక్షణాలు అమోఘమైనవిగా, నిద్రాహారాలు లేకుండా సీఎం పడే తపన చాలామందికి అవసరమా ఈయనకు అనిపిస్తుందని పవన్ అన్నారు.
పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశ్యంగా పోల్చిన పవన్, లక్షలమందిని ఏక తాటిపై నడిపించడం, తద్వారా ప్రజలకు మేలు చేయడం., అభివృద్ధి వైపు నడిపించడం చాలా కష్టసాధ్యమైన విషయమంటూ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని నడపాలి, పార్టీ వ్యక్తుల్లో ఆశలు ఉంటాయి, కుటుంబాన్ని చూసుకోవాలి.. తన కుటుంబమే కాక 5 కోట్ల ప్రజల కుటుంబాలను చూసుకోవాలి. వారికి తగ్గ అవసరాలను తీర్చాలి, వాటికి తోడు ప్రత్యర్థులు చేసే దాడిని తట్టుకోవాలి.
ఇవన్నీ తట్టుకుంటూ ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల ప్రజలకు ఎలాగ సమయం వెచ్చించాలనే సీఎం ఆలోచన విధానం చూస్తే మనస్ఫూర్తిగా హాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుందన్నారు. ఇలా పవన్ మాట్లాడుతుండగా, బాబు ఆత్మీయత భావనతో అలాగే కళ్లు చమ్మగిల్లిస్తూ ఉండిపోయారు.
ఏదిఏమైనా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల సంధర్భంగా తాను చదివిన పుస్తకంలోని ఆ పేజీ గురించి చెప్పడం విశేషం. మనం ఆ పుస్తకం చదవకున్నా మన లక్ష్యం కూడా పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో ప్రతి ఒక్కరూ నిర్ణయించుకొని ఆ దిశగా పయనిస్తే చాలు.. సక్సెస్ సాధించవచ్చన్నమాట.