
BTech Ravi : వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి 2రోజుల ముందు కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో లోకేశ్ కు స్వాగతం పలకడానికి బీటెక్ రవి ఎయిర్ పోర్టు వద్దకు వచ్చారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. జనవరి 25న జరిగిన ఈ ఘటనపై వల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
బీటెక్ రవి మంగళవారం రాత్రి 6.30 గంటలకు పులివెందుల నుంచి కడప వెళ్తుండగా ఆయనతోపాటు, డ్రైవర్, గన్‌మెన్, ఇతర సహాయకుల ఫోన్లు పని చేయలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురయ్యారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఎదుట మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని తర్వాత తెలిసింది. గంట తర్వాత బీటెక్ రవి గన్‌మెన్, డ్రైవర్, వ్యక్తిగత సహాయకులను పోలీసులు వదిలిపెట్టారు. దీంతో పోలీసులే ఆయనను అదుపులోకి తీసుకున్నారని కుటుంబసభ్యులకు తెలిసింది. బీటెక్ రవిని తొలుత వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షల నిర్వహించి కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు.
బీటెక్ రవిని అరెస్టు చేశామని కడప డీఎస్పీ షరీఫ్ ప్రకటించారు. 10 నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నాటి తోపులాట ఘటనలో ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేశామన్నారు. 10 నెలలుగా బీటెక్ రవి అందుబాటులో లేరని అందుకే ఇప్పుడు అరెస్టు చేశామని డీఎస్పీ షరీఫ్ వివరణ ఇచ్చారు.
.
.
.
Sharmila: షర్మిల.. ఇలాగైతే ఎలా? అంత తొందరపాటేలా?