“ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి.. జాగ్రత్త” అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ హెచ్చరిక వైసీపీ నేతలకు నచ్చినా.. టీడీపీ నేతలు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు జగన్ కి ఆ హెచ్చరికలు చేస్తే బాగుండేదేమో అంటున్నారు. ఎన్నికల ఏడాదిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా సజ్జల బీరాలు పలికారు కానీ వాస్తవాలు గ్రహించలేదని, అందుకే నేడు వైసీపీ 11 స్థానాలకు పరిమితమైందంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి సజ్జల సలహాలు అక్కర్లేదని, ఆయన గత ప్రభుత్వ సలహాదారేనని, ఆయన పదవీకాలం పూర్తైందని సెటైర్లు పేలుస్తున్నారు.
సజ్జల మళ్లీ యాక్టివ్..
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత కొన్నాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెరమరుగయ్యారు. మళ్లీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమన్వయకర్తగా తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే సజ్జల కూడా పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన్ను కూడా పోలీసులు విచారణకు పిలిపించారు. దీంతో గుంటూరు సీఐడి కార్యాలయానికి వెళ్లిన ఆయన.. విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అక్రమ కేసులో విచారణకు పిలిచినా.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని చెప్పారు.
మీవి నీతులు.. మావి బూతులా..?
గతంలో టీడీపీ నాయకుడు పట్టాభి బూతులు మాట్లాడారని, ప్రజాస్వామ్యంలో తామెప్పుడూ అలా మాట్లాడలేదన్నారు సజ్జల. అయితే సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ గట్టిగానే కౌంటర్లిస్తోంది. పట్టాభిని గత ప్రభుత్వం జైలుకి పంపించిందని, అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ పై బూతులతో రెచ్చిపోయిన వైసీపీ నేతలకు మాత్రం జగన్ మంత్రి పదవులిచ్చి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అసలు బూతులకు పేటెంట్ రైట్ వైసీపీ నేతలకే ఉన్నట్టుగా గతంలో రెచ్చిపోయారని ఆ విషయాన్ని సజ్జల మరచిపోయారా అని అడిగారు.
జగన్ వ్యాఖ్యలు రిపీట్..
స్థానిక సంస్థల నేతల మీటింగ్ లో ఇటీవల జగన్ కొన్ని కీలక వ్యాఖ్లు చేశారు. పాలనలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని, సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కుంభకోణాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు సజ్జల కూడా అవే డైలాగులు రిపీట్ చేశారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయని, ఎన్నికలకు ముందునుంచే కూటమి నేతలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల వరకు ఇలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సజ్జల.
సజ్జల వ్యాఖ్యలకు కూటమి నుంచి ముఖ్యంగా టీడీపీ నుంచి కౌంటర్లు గట్టిగా పడుతున్నాయి. సజ్జల సలహాలు తమకు అవసరం లేదని, ఆ సలహాలేవో జగన్ కు ఇవ్వాలని అంటున్నారు టీడీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లే వైసీపీ దారుణ పరాజయం పాలైందని దెప్పిపొడుస్తున్నారు. ఇప్పటికైనా సజ్జల వాస్తవాలు గ్రహించాలని, ఆ వాస్తవాలను తమ నాయకుడు జగన్ కి చెప్పాలని సలహాలిస్తున్నారు.