Weather Update: తెలంగాణ వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు చలి తీవ్రత గరిష్టంగా ఉంటోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే శీతల గాలులు మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న శీతల గాలులు..
రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి తక్కువ ఎత్తులో వీస్తున్న పొడి గాలుల కారణంగా ఈ చలి తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రానున్న మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుండి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ వంటి ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని, రాబోయే వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాలు.. ఈ జిల్లా ప్రాంతాలకు అలర్ట్..
ఇప్పుడు వర్షాలకు సంబంధించి చూస్తే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ప్రస్తుతం వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం ముఖ్యంగా ఏపీలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, గుంటూరు, అనంతపూర్, అన్నమయ్య, నంద్యాల, శ్రీసత్యసాయి వంటి జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా ఏపీ తీర ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో తీవ్రంగా అలల ఉదృతి పెరిగింది. దీంతో మత్స్య కారులు వేటకు వెళ్లరాదని..లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ శాఖ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
కమ్మేస్తున్న పొగమంచు.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు
చలితో పాటు దట్టమైన పొగమంచు (Dense Fog) రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. ఉదయం వేళల్లో విజిబులిటీ తగ్గిపోవడంతో జాతీయ రహదారులపై ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ఉదయం 9 గంటల వరకు సాధారణ జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Also Read: సంక్రాంతి ఎఫెక్ట్! ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర వాసులు.. హైవేపై ఫుల్ ట్రాఫిక్!
తీవ్రమైన చలి గాలుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఉన్ని దుస్తులు ధరించడం, వేడి పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ వరకు రాష్ట్రంలో ఈ శీతల గాలుల ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండటం అవసరం.