Big Stories

TDP : విజయదశమికి ముసాయిదా మేనిఫెస్టో .. ఎన్నికలకు టీడీపీ సన్నద్ధం..

TDP : ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచి పార్టీలన్నీ ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ప్రజల మధ్య ఉంటున్నారు. మరోవైవు నారా లోకేశ్ యుగగళం పాదయాత్రతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ టీడీపీకి మళ్లీ పట్టం కట్టాలని ఓటర్లను కోరుతున్నారు.

- Advertisement -

మరోవైపు టీడీపీ ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలపై దృష్టి పెట్టింది. ప్రజల భాగస్వామ్యంతో మేనిఫెస్టో రూపొందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. విజయదశమి రోజున ముసాయిదా మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. దీనిపై ప్రజలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

తాజాగా గుంటూరులో టీడీపీ బీసీల ఐక్య కార్యాచరణ సదస్సు నిర్వహించింది. పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతోపాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు.

ఎన్టీఆర్ వచ్చాకే బీసీలకు ప్రాధాన్యం కల్పించారని అచ్చెన్నాయుడు అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచారని తెలిపారు. జగన్.. 54 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే మిగిలాయని విమర్శించారు. బీసీల జన గణన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఇదే సమావేశంలో టీడీపీ మేనిఫెస్టో అంశాన్ని అచ్చెన్న ప్రస్తావించారు.

బీసీ జనగణన కోసం అంతా ఏకం కావాలని యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాన్ని నిజం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 144 బీసీ కులాలు విడివిడిగా పోరాడితే ఏమీ సాధించలేమని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల మాదిరిగానే చట్టసభల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరగాలని యనమల స్పష్టం చేశారు.

ఇలా టీడీపీ బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తూ.. ప్రజలను తమ ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీకి గుండెకాయ లాంటి బీసీ ఓట్లపైనా దృష్టిపెట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News