AP : ఆమెకు 20 రోజుల క్రితమే పెళ్లి అయింది. ఇంకా పారాణి కూడా చెరగలేదు. అత్తగారింట్లో ఉంటోంది. ఉన్నట్టుండి ఓ ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఒకడు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఇంకొకడు మంచం మీద పడుకోబెట్టాడు. రేప్ అటెంప్ట్ చేయబోయాడు. మరొకడు అక్కడ జరుగుతున్నదంతా సెల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నాడు. కాస్త ఆలస్యమైతే ఏమైపోయేదో. అంతలోనే ఆ యువతి మామ వచ్చారు. వాళ్లను చూసి గట్టిగా అరిచాడు. అది విని చుట్టు పక్కల వాళ్లంతా వచ్చారు. ఆ ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ విషయం ఊరంతా తెలీడంతో ఆ కొత్త పెళ్లికూతురు పరువంతా పోయినట్టు బాధపడింది. తానిక బతకలేనంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను హాస్పిటల్‌లో చేర్చితే.. కోలుకుంటోంది.
పల్నాడు జిల్లా అత్తలూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. నవ వధువుపై అత్యాచార యత్నం జరిగింది. ఆ ముగ్గురులో ఒకడు పెళ్లికి ముందు నుంచే ఆ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా అతడు వెంటబడటం మానలేదు. వాడి టార్చర్ తట్టుకోలేకే ఆమె ఇటీవలే పెళ్లి చేసుకుంది. అది తెలిసి అతడు మరింత రెచ్చిపోయాడు. ఫ్రెండ్స్‌ను తీసుకొని ఆమె అత్తారింటికి వెళ్లి రేప్ చేయాలని చూశాడు. అదంతా వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలనేది వాళ్ల ప్లాన్. ఆ యువతి మామ రావడంతో వాళ్ల స్కెచ్ బెడిసికొట్టింది. అయితే..
అత్తింటి వాళ్లు ఆ కొత్త పెళ్లి కూతురినే అనుమానించారు. నీ ప్రమేయం లేకుండానే వాళ్లు ఇంటి వరకూ వచ్చారా? అంటూ ఆరోపణలు చేశారు. ఆ మాటలకు ఆమె మరింత హర్ట్ అయి.. సూసైడ్ అటెంప్ట్ చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు.