Tirumala News: తిరుమలలో రోజు రోజుకూ రద్దీ పెరుగుతూనే ఉంది. సీజన్ ఏదైనా అసలు రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. టికెట్లు మొదలు దర్శనం వరకు పలు మార్పులు చేసింది.
తిరుమలకు నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. కొండపై ఎటు చూసినా శ్రీవారి భక్తులు కనుచూపు మేరలో కనిపిస్తున్నారు. రద్దీని తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా శ్రీవాణి టికెట్ల విషయంలో పలు మార్పులు చేపట్టింది. శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్‌లో పొందిన భక్తుల దర్శనం వేళలను మార్చింది.
ఈ విషయాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. ఆగస్టు ఒకటి నుంచి 15 వరకు ఏ రోజుకు ఆరోజు శ్రీవాణి దర్శనం టికెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న విధానంలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ల్లో 1,500 టికెట్లు ఇస్తోంది. అయితే దర్శనానికి మూడు రోజుల సమయం పడుతోందని భావించింది.
దీనివల్ల కొండపై విపరీతమైన రద్దీ పెరుగుతోందన్నది టీటీడీ ఆలోచన. కొత్త పద్ధతి ద్వారా టికెట్ల సంఖ్యలో ఏలాంటి మార్పు ఉండదు. కాకపోతే దర్శన వేళలను మార్చింది. కొండపైకి వచ్చే భక్తులు ఏ రోజుకు ఆరోజు శ్రీవాణి టికెట్లను తీసుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చు.
ALSO READ: ఏపీ ఆ నగరాలకు పండగే.. కొత్త మార్కెట్లు రాబోతున్నాయి
ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా సాయంత్రం నాలుగున్నరకు దర్శనానికి అనుమతిస్తారు. ఇక తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి టికెట్లను జారీ చేస్తుంది. మొదట వచ్చిన తొలి ప్రయార్టీ ప్రాతిపదికన 800 టికెట్లను ఇవ్వనుంది.
అలాగే రేణిగుంట ఎయిర్‌పోర్టులో శ్రీవాణి టికెట్లను ఉదయం 7 గంటల నుంచి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకు అంటే దాదాపు 200 టికెట్లను జారీ చేయనుంది. టికెట్లను పొందినవారు అదే రోజు సాయంత్రం నాలుగున్నరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద దర్శనానికి అనుమతి ఇస్తారు.
ఇక ఆన్‌లైన్‌లో యథావిధిగా రోజుకు 500 టికెట్లు ఇస్తారు. ఇప్పుటికే అడ్వాన్స్ బుకింగ్‌లో అక్టోబరు 31 వరకు ఆన్‌లైన్ టికెట్లు పొందిన భక్తులను పాతపద్దతిలో ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతిస్తారు.
నవంబరు ఒకటి నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులను సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా దర్శనానికి అనుమతించనున్నట్లు అదనపు ఈవో తెలిపారు. శ్రీవాణి దర్శనాలపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి పై నిర్ణయాలు తీసుకున్నారు.