YS Jagan New Sketch: ఏపీ రాజకీయాల్లో రెడ్‌బుక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేశ్ చివరి ఏడాదిలో రెడ్‌బుక్ ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చాక వరుస అరెస్టులతో అదే వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది . ఆ క్రమంలో వైసీపీ నాయకులపై నమోదవుతున్న కేసులు, జరుగుతున్న అరెస్టులు ఆ రెడ్‌బుక్ ప్రణాళిక ప్రకారమే నడుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసులపై ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు జగన్ వైసీపీ పీఏసీ సమావేశంలో ప్రకటించారు. జగన్ డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ ప్రత్యేక యాప్ అంటుండటం చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ తామే అధికారంలోకి వస్తామని జగన్ ధీమా
ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి నిండా ఏడాదిన్నర పూర్తి కాలేదు. అంటే ఇంకా దాదాపు నలుగేళ్లు కూటమి సర్కారే రాష్ట్రాన్ని పాలిస్తుంది. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను సెట్‌రైట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నానా పాట్లు పడుతోందన్న అభిప్రాయం ఉంది. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబు అధికారంలో ఉండేది మూడేళ్లేనని జోస్యం చెప్తున్నారు. తర్వాత తానే అధికారంలోకి వస్తానని .. అప్పుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగులు ఇస్తున్నారు. కేసులకు భయపడమంటూనే వైసీపీ నేతల అరెస్టులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లిక్కర్ స్కాంలో వరుసగా అరెస్ట్ అవుతున్న వైసీపీ కీలక వ్యక్తులు
జగన్ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం ఉధృతమవుతోంది. ఆ భయంతోనే ఆయన హస్తినలో అండ కోసం పాకులాడుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. లిక్కర్ కేసులో అరెస్టులకు వ్యతిరేకగా ఢిల్లీలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ఆప్తులుగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, అప్పటి ఓస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, అప్పటి సలహాదారుల్లో ఒకరైన వాసుదేవరెడ్డి, స్కాంలో కీలకంగా వ్యవహరించి ఏ-1గా బుక్ అయిన రాజ్ కేసిరెడ్డి, భారతీ సిమెంట్స్ ఆడిటర్ గోవిందప్ప.. తాజాగా రాజ్ కేసిరెడ్డి కలెక్షన్ టీమ్‌లో ముఖ్యుడైన వరుణ్ అరెస్ట్ అయ్యారు. వరుణ్ అరెస్ట్ సందర్భంగా రూ.11 కోట్ల నగదు, భారీ లిక్కర్ డంప్ కూడా బయటపడింది.
వైసీపీ పీఏసీ సమీవేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
ఆ క్రమంలో తాజాగా జరిగిన వైసీపీ పీఏసీ మీటింగులో మాజీ సీఎం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దె దిగాక జగన్ ఈ తరహాలో మాట్లాడటం కొత్తేమీ కాదు. అయితే తాజాగా దూకుడు మరింత పెంచడంతో కూటమి పార్టీలతో పాటు పోలీసులకు కూడా టార్గెట్ అవ్వాల్సి వస్తోంది. అయినా వైఖరి మార్చుకోని జగన్ పీఏసీ మీటింగులో మరోసారి అందరికీ వార్నింగులు ఇచ్చారు. జంబో కార్యవర్గంతో పీఏసీని ఏర్పాడు చేసిన జగన్.. పీఏసీలో ఉన్నవారు రాజకీయంగా చాలా అనుభవం ఉన్నవారని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీరంతా అవగాహన ఉన్నవారని ప్రశంసిస్తూ.. పార్టీ బలోపేతానికి వారి ఆలోచనలు, సూచనలు చాలా అవసరమనంటున్నారు.
జగన్-02లో కార్యకర్తలకే పెద్దపీట అంటున్న మాజీ సీఎం
ప్రస్తుత అరెస్టుల క్రమం పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశమని.. అరెస్టులతో సానుభూతి పెరుగుతున్నట్లు మాట్లాడుతున్నారు. పార్టీకోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తోందంట. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశమని, అరెస్టులకు భయపడవద్దని దిశానిర్ధేశం చేస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలు అయ్యాక బూత్ కమిటీలు వేయాలని పార్టీ నేతలకు మార్గనిర్ధేశం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన … జగన్-02లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని, మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా, అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో గతంలోలా కాదని.. కచ్చితంగా వారికి పెద్ద పీట వేస్తామంటున్నారు..
143 హామీల అమలులో టీడీపీ విఫలమైందని ధ్వజం
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ అన్నది స్పష్టమైందన్నారు. చంద్రాబాబు మోసాలు మరింతగా ఎండగట్టాలని, ఆ దిశంలో ఇప్పటికే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తమ కార్యక్రమం చేరాలని పీఏసీ సభ్యులకు పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చాక వడ్డీతో కలిపి తీర్చుకుంటామని హెచ్చరికలు
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. వేధింపులకు గురిచేస్తున్నారనేది వైసీపీ వాదన. తాము అధికారంలో వచ్చాక అసలుకు వడ్డీ కలిపి తీర్చుకుంటామని జగన్ మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలపై ప్రభుత్వ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలను ఎవరైన వేధిస్తే ఆ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేసి.. అధికారంలోకి రాగానే వేధించిన వాళ్లందరికీ సినిమా చూపిస్తామని తన స్టైల్లో వార్నింగ్ ఇఛ్చారు
మిథున్ రెడ్డికి లిక్కర్ స్కాంతో సంబంధం లేదని వ్యాఖ్మ
రాష్ట్రంలో టీడీపీ భయానక వాతావరణ సృష్టిస్తోందని జగన్ మండిపడ్డారు. వైసీపీ సీనియర్ నేతలను అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇదే పద్ధతి కొనసాగితే తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మిథున్ రెడ్డి అరెస్ట్ బాధకరమని.. లిక్కర్ కేసుతో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సామాన్యుడి నుంచి ఎంపీగా ఎదిగిన నందిగాం సురేశ్ మీద కూడా అక్రమ కేసులు పెట్టి వేధించడం ఘోరమన్నారు. అధికారంలోకి వచ్చాక అసలుకు వడ్డీ కలిపి చూపిస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఏం విత్తారో అదే చెట్టు అవుతుందని జగన్ అంటున్నారు. ఇప్పుడు ఆయన చేసేదే ఆయనకు రివర్స్ అవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
జగన్ భద్రతపై పీఏసీ సభ్యుల ఆందోళన
జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళన కరంగా ఉందని, మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటామని పీఏసీ సభ్యులు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వైయస్.జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజా సమస్యలపై కార్యచరణ ప్రకటించి, జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే జగన్ ఎప్పుడు మైక్ ముందుకొచ్చినా, ఆఖరికి పీఏసీ నియామకం తర్వాత జరిగిన తొలి సమావేశంలోనూ అధికారంలోకి వచ్చేస్తామని ప్రకటనలు చేస్తూ, అందరికీ వార్నింగులు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read: కడప గడ్డపై సీన్ రివర్స్! వైసీపీకి గడ్డుకాలమే
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం సలహాదారుల టీమ్‌ను నియమించుకుని పాలించిన జగన్‌కు రాష్ట్ర పరిస్థితులపై సంపూర్ణ అవగాహన లేదని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదించే ఆయన రాజకీయ పరిపక్వత సాధించలేదన్న అభిప్రాయం ఉంది. దానితోడు గద్దె దిగాక జగన్ ఇంకా తానే సీఎం అని భ్రమల్లో ఉన్నారని, రాష్ట్రానికి తానే శాశ్వత సీఎం అని ఫీలవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడా నిండా పద్నాలుగు నెలలు గడవకుండానే జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అని ధీమా వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారులకు వార్నింగులు ఇస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది.
Story By Vamshi Krishna, Bigtv