Tirumala: ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. టీటీడీ వెబ్ సైట్, యాప్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు భక్తులు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కూడా ఓపెన్ చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరింది.
శ్రీవారికి సేవ చేయాలనుకునే భక్తుల కోసం శ్రీవారి సేవ, పరకామణి సేవలకు సంబంధించిన కోటాను జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. అయితే, ఈ సేవా కోటా మార్చి నెలకు సంబంధించినదని భక్తులు గమనించాలి.
జనవరి 25న తిరుమలలో నిర్వహించే రథ సప్తమి వేడుకలకు భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన టీటీడీ అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్న ప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా ఇప్పటికే తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తుల భద్రత, వివిధ విభాగాల సమన్వయం, ప్రవేశ, ఎగ్జిట్ మార్గాల వద్ద అధికారుల తీసుకోవాల్సి చర్యలను అధికారులతో చర్చించామన్నారు. గ్యాలరీల్లో కూర్చునే భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బంది పడకుండా పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
రథ సప్తమి నాడు తిరుమలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. గ్యాలరీల్లో భక్తుల కోసం ప్రత్యేకంగా పందిళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీకి చర్యలు చేపట్టింది. అలాగే పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా లడ్డూలను అందుబాటులో ఉంచారు.
జనవరి 25న అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారన్నారు. రథసప్తమి రోజున ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. జనవరి 24 నుంచి 26 వరకు SSD టోకన్ల జారీ నిలిపివేస్తున్నట్లు వివరించారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల కోసం 52 ఫుడ్ కౌంటర్లు, 14 రకాల మెనూతో నిరంతర అన్నప్రసాదాలు అందజేస్తామన్నారు.
Also Read: తిరుమల ఏప్రిల్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల.. ఈ నెల 25న మినీ బ్రహ్మోత్సవాలు
రథ సప్తమి రోజున ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపకాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో తెలిపారు. ప్రోటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పారు. ఎన్ఆర్ఐలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల దర్శనాలు కూడా నిలిపివేసినట్లు చెప్పారు. ఇవాళ ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమన్నారు.