Tirumala:తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెల దర్శన కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లు కన్ఫార్మ్ చేసుకోవచ్చు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జనవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను జనవరి 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది.
సూర్య జయంతి సందర్భంగా జనవరి 25న తిరుమలలో రథసప్తమి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మాఘ మాసంలో రథ సప్తమి రోజున సూర్యదేవుడు జన్మించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు.
• జనవరి 25 తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు– సూర్యప్రభ వాహనం.
• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
• ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
• సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
• రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
రథసప్తమి కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.
Also Read: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలనం.. లంచం తీసుకున్నట్టు అంగీకరించిన టీటీడీ మాజీ అధికారి