Vaikunta Dwara Darshanam: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.
వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు(డిసెంబర్ 30, 31, జనవరి 1) ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.
మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లోని టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2 మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలను భక్తులకు అందిస్తారు.
వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నంబర్ 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి.
అనంతరం మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాలి.
అనంతరం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో దర్శనం కావాల్సిన రోజులను లేదా మూడు రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను సరి చూసుకుని సబ్మిట్ చేయాలి. ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలు పడదు. ఆధార్ నంబర్, పిన్ కోడ్ ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల వివరాలు సబ్మిట్ చేయగానే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్స్ నెంబర్ గా పరిగణిస్తారు. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది.
వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులు ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయరని టీటీడీ తెలిపింది.
వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేసినట్లు టీటీడీ తెలిపింది.
వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయరు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8 వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5 వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు.
వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు.
Also Read: Shiva Temple: బాలుడి కలలో శివుడి దర్శనం.. నాగుపాము పుట్టలో శివలింగం
రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు రోజుకు 125 మందికి దర్శనం కల్పించనున్నారు. రూ.లక్ష నుంచి రూ.99 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ 30, 31 తేదీల్లో రోజుకు 1000 మందికి, జనవరి 1 నుండి 8వ తేది వరకు రోజుకు 2వేల మందికి దర్శనం కల్పించనున్నారు. వీరు కూడా ఆన్ లైన్ అప్లికేషన్ లో డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.