వల్లభనేని వంశీకి మళ్లీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈసారి ఆయన కోర్టు బయట మరింత విషాద వదనంతో కనిపించారు. తెల్ల జుట్టు పూర్తిగా ట్రిమ్ చేయించారు, నీరసంగా నడుస్తున్నారు. ఆయనకు జైలులో వైద్య సహాయం అందుతున్నట్టు ఆయన భార్య పంకజశ్రీ తెలిపారు. జైలుకెళ్లిన మీగతా నేతల వీడియోలపై ఇంత చర్చ జరగడంలేదు కానీ, వల్లభనేని వంశీ జైలునుంచి బయటకు రాగానే, ఆయన ఆహార్యంపై మాత్రం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఎలా ఉండే వంశీ, ఎలా అయిపోయారంటూ వంశీని ట్రోల్ చేస్తున్నారు.
వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ క్లారిటీ.. pic.twitter.com/NOUhJ0ExME
— Rahul (@2024YCP) May 6, 2025
2019లో టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచి ఫ్యాన్ ఎదురుగాలిలోనూ గెలిచి నిలిచిన వంశీ.. ఆ తర్వాత వెంటనే ప్లేటు ఫిరాయించారు, జగన్ వైపు వెళ్లారు. టీడీపీలో ఉండగా జగన్ ని ఏ స్థాయిలో తిట్టేవారో, అంతకు పదిరెట్లు ఆయన వైసీపీలోకి వెళ్లి చంద్రబాబు, లోకేష్ పై మాటల తూటాలు పేల్చారు. అసలు చంద్రబాబు కంటతడి పెట్టడానికి కారణం కూడా వంశీయే అని అంటారు టీడీపీ నేతలు. చంద్రబాబు కుటుంబంపై అసభ్యంగా మాట్లాడారని, నారా లోకేష్ పై కూడా నీఛమైన వ్యాఖ్యలు చేశారనే అపవాదు ఆయనపై ఉంది. అయితే వంశీ అరెస్ట్ వ్యవహారం చాలా విచిత్రంగా జరిగింది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన నిందితుడుగా మారారు. ఆ తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోడానికి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించడం మరింత సంచలనంగా మారింది. సత్యవర్దన్ కిడ్నాప్ వ్యవహారం ఎస్సీ, ఎస్టీ కేసుగా మారడంతో వంశీ తప్పించుకోలేకపోయారు. ఏదో కేసులో అరెస్ట్ అవుతారనుకుంటే, ఇంకేదో కేసులో అరెస్టై.. రెండు నెలలుగా ఆయన కటకటాల వెనక ఉండాల్సి వచ్చింది.
వల్లభనేని వంశీ జైలుకి వెళ్లాక పూర్తిగా మారిపోయారు. ఇస్త్రీ నలగని చొక్కా వేసుకున్నా కూడా తలకు రంగు వేసుకోకపోవడంతో ఆయన వయసుపై కూడా కామెంట్లు మొదలయ్యాయి. ఓ దశలో అంబటి రాంబాబు కూడా వంశీ హెయిర్ డై గురించి మాట్లాడటం ఆసక్తికరం. ఇక వంశీలో మునుపటి చురుకుదనం లేదు, ఆయన నీరసపడిపోయారు. మెట్లెక్కేందుకు కూడా స్టెయిర్ కేస్ ని పట్టుకుని నిదానంగా నడుస్తున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా ఆయన్ను ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ని సమస్యల మధ్య ఆయన నీరసపడిపోవడంతో టీడీపీ శ్రేణులు.. మరింత గట్టీగా ట్రోల్ చేస్తున్నాయి.
వాస్తవానికి వల్లభనేని వంశీని ఎవరూ ట్రోల్ చేసేవాళ్లు కాదేమో. కానీ ఆమధ్య జగన్ జైలుకెళ్లి వంశీని పరామర్శించి బయటకొచ్చాక చేసిన వ్యాఖ్యలు ఈ ట్రోలింగ్ కి ప్రధాన కారణం. వంశీ అందగాడని, అలాంటి అందగాళ్లంటే చంద్రబాబుకి, లోకేష్ కి కుళ్లు అని అన్నారు జగన్. అందుకే వారిని అరెస్ట్ చేయించారని చెప్పారు. జగన్ వ్యాఖ్యలతో నెటిజన్లు మరింత దారుణంగా వంశీని ట్రోల్ చేస్తున్నారు. వంశీ తెల్లజుట్టు, తెల్ల గడ్డంతో బయటకు వచ్చిన ఫొటోల్ని పెట్టి అందగాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈనెల 13 వరకు వంశీ రిమాండ్ ని పొడిగించింది. హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ని గతంలో కొట్టి వేయడంతో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.