TTD BR Naidu Statement: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కీలక ప్రకటన జారీ చేశారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల పరేడ్ మైదానంలో క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీ గురించి శుభవార్త చెప్పారు. అలాగే అన్నప్రసాదం వితరణపై టీటీడీ కీలక ప్రకటన చేసింది.
చైర్మన్ మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులు జాతీయ అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారు కావాలన్నారు. వచ్చే ఏడాదికి పటిష్ట టీమ్‌లను తయారు చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. అంతేకాకుండా త్వరలో టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చైర్మన్ తెలిపారు. టీటీడీలో ఉద్యోగాల భర్తీ సమయంలో స్పోర్ట్స్ కోటాలో కూడా అవకాశం కల్పిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులకు ఉద్యోగులు విశేష సేవలు అందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని వాటిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. ఉద్యోగుల సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమిని విజయవంతం చేయడం జరిగిందన్నారు.
టీటీడీ చైర్మన్ ను కలిసిన తిరుపతి కార్పొరేటర్లు
టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ను శుక్రవారం మర్యాదపూర్వకంగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించిన పలు అంశాలను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. నెలకు ఒకసారి తమ కుటుంబ సభ్యులకు శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలని వారు కోరారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు.
Also Read: Traffic Rules In AP: వాహనదారులకు షాక్.. కొత్త రూల్స్ అమల్లోకి.. లైన్ దాటితే జేబుకు చిల్లే..
ఒక రోజు విరాళ పథకం వివరాలు..
తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే. ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలను టీటీడీ ప్రకటించింది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు వెచ్చిస్తారు. దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. మరెందుకు ఆలస్యం.. రూ. 44 లక్షలు చెల్లించండి. ఒకరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం అందించే భాగ్యాన్ని పొందండి.