Traffic Rules In AP: ఏపీలో రూల్స్ మారాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ పాటించకుంటే, జేబుకు చిల్లు పడిపోతుంది. మే ఒకటో తేదీ నుండి నూతన రూల్స్ అమల్లోకి వస్తాయని ఇప్పటికే ఏపీలోని ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ రూల్స్ ఏమిటి? మారిన రూల్స్ ప్రకారం జరిమానాల స్థితిగతులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర మోటార్ వెహికల్ చట్టం మార్చి ఒకటో తేదీ నుండి అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి ఒకటో తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ సైతం సిద్ధమైంది. ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలను పెంచినట్లు పోలీస్ అధికారులు ప్రకటన విడుదల చేస్తున్నారు.
ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అలాగే అన్ని ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. హెల్మెట్ ధారణ పాటించకపోయినా, సీట్ బెల్ట్ ధరించని పక్షంలో అధిక జరిమానాలు విధించనున్నట్లు ఇప్పటికే ప్రకటన విడుదలైంది. రవాణా భద్రత నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధనలు అమలు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Crime News: అమ్మో ఆడ దొంగలు.. బెట్టింగ్ దెబ్బకు చైన్ స్నాచింగ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
ఆ జరిమానాల వివరాలు ఇవే..
హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి రూ. 1000, అలాగే బైక్ వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని పక్షంలో రూ. 1000 , డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5000, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 4000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో రూ. 1500, అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 1500, రెండవసారి రూ. 10000, ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 150, రెండవసారి రూ. 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు రూ. 750, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో రూ. 1000, కారు డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించని పక్షంలో మరో రూ. 1000, వాహన రిజిస్ట్రేషన్ లేనిపక్షంలో రూ. 2000, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 5000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి రూ. 5000, రెండవసారి రూ. 10000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే రూ. 1000, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తే రూ. 1000 జరిమానా విధించనున్నారు.