Tirumala News: వీఐపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం షాకిచ్చింది. కలియుగ వైకుంఠ శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆయా దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
నూతన తెలుగు సంవత్సరాది పురస్కరించుకొని తిరుమలలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మంగళవారం అష్టాదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసింది. మార్చి 30న అంటే ఆదివారం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో మార్చి 24, 29న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించబోమని స్పష్టం చేసింది. మార్చి 25, 30న ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను మాత్రమే బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇవ్వనుంది.
జూన్ నెల సేవా టికెట్లు విడుదల
జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు ఇవాళ విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. వీటిలో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20వ వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22న మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరు చేయనుంది.
ALSO READ: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వైసీపీ నేత
మార్చి 21న సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈనెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అలాగే మార్చి 21న జ్యేష్టాభిషేకం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. జూన్ 9 నుంచి 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవం జరగనుంది. ఇందులో పాల్గొనే భక్తుల టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచుతుంది.
మార్చి 21న వర్చువల్ సేవా టికెట్లు విడుదల. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే మార్చి 22న అంగప్రదక్షిణం టోకెన్లు సైతం విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆయా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
మార్చి 22న శ్రీవాణి టికెట్లు
ఇక అన్నింటికంటే ముఖ్యమైని శ్రీవాణి టికెట్ల కోటా. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 22న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనుంది.
24న ప్రత్యేక దర్శనం టికెట్లు, వసతి
మార్చి 24న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనుంది. జూన్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టికెట్లు, ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. మధ్యాహ్నాం మూడు గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లో వసతి సముదాయాల టికెట్లు విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లను టీటీడీ వెబ్‌సెట్ ద్వారానే బుక్ చేసుకోవాలని తెలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం.
తిరుమలలో రద్దీ మాటేంటి?
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. సోమవారం శ్రీవారిని 70,824 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 25,674 మంది భక్తులు సమర్పించుకున్నారు. తిరుమలలో హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చినట్టు టీటీడీ వర్గాలు తెలిపాయి.