TTD suspension: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు సంబంధించి మరోసారి ఓ కీలక చర్య తీసుకుంది. టీటీడీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను మత సంబంధిత విషయాలపై తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురు బర్డ్ ఆసుపత్రిలో విధులు నిర్వహించగా, మరొకరు ఎస్‌వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్నారు.
సస్పెండ్ అయిన ఉద్యోగుల వివరాలు.. బి. ఎలిజర్ – డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి – స్టాఫ్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, ఎం. ప్రేమావతి – గ్రేడ్-1 ఫార్మసిస్ట్, బర్డ్ ఆసుపత్రి, డాక్టర్ జి. అసుంత – ఎస్‌వీ ఆయుర్వేద ఫార్మసీ విభాగానికి చెందిన వారుగా టీటీడీ ప్రకటించింది.
వీరిపై వచ్చిన ఆరోపణలు ఏమిటంటే…
ఈ నలుగురు ఉద్యోగులు అన్య మతాన్ని అనుసరిస్తున్నారని, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు టీటీడీకి అందినట్లు సమాచారం. ఉద్యోగి హోదాలో ఉండి హిందూ ధార్మిక సంస్థలో విధులు నిర్వహిస్తూ, స్వంతంగా వేరే మతాన్ని అనుసరించడమంటే అది టీటీడీ నియమావళికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇదే విషయాన్ని అధికారికంగా గుర్తించి, విజిలెన్స్ విభాగం ఒక సమగ్ర నివేదికను అందించింది.
ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై చర్య
టీటీడీకి చెందిన ఉద్యోగులు.. అది చిన్న స్థాయి ఉద్యోగమైనా, పెద్ద హోదా అయినా హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, సంస్థ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. కానీ, ఈ నలుగురు ఉద్యోగుల ప్రవర్తన టీటీడీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాక, హిందూ విశ్వాసాలను అవమానించేలా ఉందని అధికారులు భావించారు.
Also Read: Nagarjuna Sagar hidden spot: తెలంగాణలో ఐలాండ్.. 4 గంటలే ఓపెన్.. అలా వెళ్లి ఇలా రావచ్చు!
విజిలెన్స్ నివేదిక ఆధారంగా తక్షణ సస్పెన్షన్
విజిలెన్స్ శాఖ సేకరించిన ఆధారాలు, అంతర్గత విచారణల తర్వాత టీటీడీ యాజమాన్యం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని భావించింది. చివరికి ఈ నలుగురిపై వెంటనే సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఉద్యోగులపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. విచారణ అనంతరం తగినంత శిక్ష లేదా నిర్ణయం తీసుకోనున్నారు.
సంస్థ పరిరక్షణకు టీటీడీ గట్టి నిర్ణయం
ఇటీవల టీటీడీలో హిందూ మత సంబంధ అంశాలపై ప్రజలలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో, ఉద్యోగులు ఇతర మతాన్ని అనుసరించడం హిందూ భక్తుల్లో అసహనం కలిగిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. టీటీడీ ఉద్యోగిగా హిందూ ధర్మాన్ని పాటించాల్సిందేనన్న విధానాన్ని సంస్థ స్పష్టంగా తెలియజేసింది.
ఇకపై కూడా మత సంబంధిత అంశాల్లో టీటీడీ మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం. నియమాలు అతిక్రమించే వారిపై అలాంటి నిర్ణయాలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ టీటీడీ ప్రధాన లక్ష్యం అని చెప్పుకోవాలి. ఉద్యోగులు కూడా అదే దిశగా ఉండాలని ఇప్పటి వరకే సంస్థ ఆదేశిస్తోంది.