Monsoon Foods: వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల మన జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం లేదా వాటిని తగ్గించడం మంచిది. మరి ఎలాంటి ఆహార పదార్థాలను వర్షాకాలంలో తినకుండా ఉంటే మంచిదనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆకుకూరలు, పచ్చి కూరగాయలు:
వర్షాకాలంలో ఆకుకూరలు (పాలకూర, తోటకూర, మెంతి కూర మొదలైనవి) కొన్ని పచ్చి కూరగాయలు (క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి) తినకుండా ఉండటం మంచిది. వర్షాలు పడటం వల్ల ఈ కూరగాయలపై మట్టి, బురద, క్రిములు చేరతాయి. వీటిని ఎంత శుభ్రం చేసినా.. పూర్తిగా తొలగించడం కష్టం. ఇవి అజీర్ణం, కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ తినాలనుకుంటే.. వాటిని వేడి నీటిలో ఉప్పు లేదా పసుపు వేసి బాగా కడిగి, పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
2. స్ట్రీట్ ఫుడ్ :
వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ కి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. పానీ పూరీ, భేల్ పూరీ, కట్లెట్స్, సమోసాలు వంటి వాటిని కొంత మంది స్ట్రీట్ ఫుడ్ అపరిశుభ్రమైన ప్రాంతాల్లో తయారు చేస్తారు. నీరు, నూనె నాణ్యత సరిగా లేకపోవడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల టైఫాయిడ్, కలరా, అతిసారం వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటి జ్యూస్‌లు, కట్ చేసిన పండ్లకు కూడా దూరంగా ఉండాలి.
3. పుట్టగొడుగులు:
పుట్టగొడుగులు సాధారణంగా తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతాయి. వర్షాకాలంలో కొన్ని రకాల పుట్టగొడుగులలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అజీర్ణం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సీజన్‌లో పుట్టగొడుగులను తినడం మానుకోవాలి.
4. చేపలు, ఇతర సీఫుడ్:
వర్షాకాలం చేపలు, ఇతర సీఫుడ్‌కు సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో అవి గుడ్లు పెడతాయి. అలాగే, ఈ సమయంలో నీటిలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల చేపలు, ఇతర సముద్రపు జీవుల ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో సీఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది.
Also Read: డైలీ ఈ సీడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
5. నూనెలో వేయించిన పదార్థాలు:
వర్షాకాలంలో వేడివేడి పకోడీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది. అయితే.. ఎక్కువ నూనెలో వేయించిన పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వర్షాకాలంలో జీర్ణశక్తి మందగించడం వల్ల ఇవి అజీర్ణం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి.
6. పాల ఉత్పత్తులు:
పాలు, పాల ఉత్పత్తులు (పనీర్, చీజ్ వంటివి) తేమతో కూడిన వాతావరణంలో త్వరగా పాడైపోతాయి. వర్షాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే.. వాటిని బాగా మరిగించి, తాజాగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.