AP Politics: సీమసింహం నందమూరి బాలకృష్ణ అడ్డా హిందూపురంలో వైసీపీ పూర్తిగా హ్యాండ్సప్ అనేస్తోందా? ఎంతో కష్టపడితే తప్ప గెలువలేని చోట విభేదాలతో పార్టీ రోడ్డున పడుతోందా? ముచ్చటగా మూడు గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారా? అక్కడ విభేదాలు పరిష్కరించలేక హిందూపురంలో జగన్ స్వయంగా బాలయ్యకు ఎదురు లేకుండా చేస్తున్నారా? నేతల విభేదాలు పరిష్కరించి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన వైసీపీ అధ్యక్షుడు తన ఏకపక్ష నిర్ణయాలతో బాలయ్యకు ఎదురు లేకుండా చేస్తున్నారా?
హిందూపురంలో అంతర్గత కలహాలతో చతికిల పడుతున్న వైసీపీ
అధికారం లేకపోయినా వైసీపీలో విభేదాలు మాత్రం సమసిపోలేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ అంతర్గత కలహాలతో ఎలా చతికిల పడుతుందో… ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఒక్కసారి కూడా ప్రత్యర్ధులు టీడీపీని ఓడించలేకపోయారు. 1985 నుంచి ఇక్కడ తెలుగు దేశం హవా కొనసాగుతోంది.
నందమూరి కుటుంబానికి సెంటిమెంట్‌గా మారిన హిందూపురం
నందమూరి కుటుంబానికి సెంటిమెంట్‌గా తయారైన హిందూపురంలో బాలకృష్ణ గత ఎన్నికల్లో వరుసగా మూడో సారి గెలిచి హ్మాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2014 ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తున్న బాలయ్య ప్రతిసారి తన మెజార్టీని రెట్టింపు చేసుకుంటూ హిందూపురంలో అన్‌స్టాపబుల్ అనిపించుకుంటున్నారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందూపురంలో మొదటి సారి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి ఆయన హిందూపురంనే తన కోటగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ వరుసగా మూడుసార్లు, ఆయన తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ ఒక సారి, ఆ తర్వాత బాలకృష్ణ మూడు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. మధ్యలో 1999 నుంచి 2009 ఎన్నికల వరకు మూడుసార్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా, స్థానిక నేతలకు టీడీపీ అవకాశం ఇచ్చింది. ఆ మూడు సార్లు హిందూపురం ఓటరు టీడీపీకే అండగా నిలిచాడు.
బాలయ్య ఎంట్రీలో టీడీపీకి అడ్డాగా మారిన హిందూపురం
ఇక 2014లో బాలకృష్ణ ఆరంగేట్రం చేశాక హిందూపురం ఆయన అడ్డాగా మారింది. వైసీపీ ఆయన్ని ఓడించడానికి 2014, 2019, 2024 ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చినా ఫలితం దక్కలేదు. హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో బీసీ మహిళ కార్డుతో బాలయ్యకు షాక్ ఇవ్వాలని చూసినా వైసీపీ పప్పులు ఉడకలేదు. పైపెచ్చు బాలయ్య మెజార్టీ 18 వేల నుంచి 31 వేలకు పెరగడం గమనార్హం. ఈ సారైనా హిందూపురంలో పాగా వేయాలని జగన్ భావిస్తున్నా.. అక్కడ వర్గ విభేదాలు కలిసిరావడం లేదంట. అన్ స్టాపబుల్ బాలయ్యను ఢీకొట్టాలంటే అందరూ సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే గ్రూపుల గోలతో బజారున పడుతోంది హిందూపురం వైసిపి.
2029లో వైసీపీ అభ్యర్థిని తానే అంటున్న నవీన్ నిశ్చల్
ఇంకా ఎన్నికలకు నాలుగేళ్లు సమయం ఉండగానే అభ్యర్థి నేనంటే నేనని వైసీపీ నేతలు సిగపట్లకు దిగుతున్నారు. 2029 లో హిందూపురం వైసిపి అభ్యర్థిగా తానేనని వైసీపీ సీనియర్ నేత నవీన్ నిశ్చల్ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. 2004 నుంచి స్థానిక నేత నవీన్ నిశ్చల్ కాంగ్రెస్, వైసీపీల నుంచి పోటీ చేస్తూ మూడుసార్లు టీడీపీకి గట్టిపోటీనిచ్చారు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయనను 2019 ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. 2019లో బాలయ్యపై రిటైర్డ్ పోలీసు అధికారి ఇక్బాల్ ను పోటీకి పెట్టింది వైసీపీ. 2024 ఎన్నికల్లో సైతం నవీన్ నిశ్చల్ ను కాదని తిప్పేగౌడ నారాయణ్ దీపిక అనే మహిళా నేతను మాజీమంత్రి పెద్దిరెడ్డి రికమండేషన్‌తో బరిలోకి దింపి చేతులు కాల్చుకుంది.
వైఎస్ జయంతి వేడుకల్లో తన పోటీపై ప్రకటించిన నవీన్ నిశ్చల్
ఎన్నికల తర్వాత కూడా దీపికనే హిందూపురం వైసీపీ ఇన్చార్జ్‌గా జగన్ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఇటీవల జరిగిన వైయస్సార్ జయంతి వేడుకల్లో నవీన్ నిశ్చల్ తన పోటీపై ప్రకటన చేయడం, నియజకవర్గంలో ఎవరికి వారే వైయస్సార్ జయంతి వేడుకలను జరపడం కూడా వైసీపీలోని వర్గ విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. ఆరు నూరైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా… ఈసారి తానే అభ్యర్థిగా ఉంటానని నవీన్ నిశ్చల్ కుండబద్దలు కొట్టడం తో ప్రస్తుత ఇంచార్జ్ దీపిక వర్గం అలర్ట్ అవుతోందంట. అదే రోజు మరో కార్యక్రమంలో దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే పోటీలో ఉంటానంటూనని, అందరూ కలిసికట్టుగా తనను గెలిపించాలని వ్యాఖనించడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం రేపుతోందంట.
నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన దీపిక
అదలా ఉంటే నవీన్ నిశ్చల్ వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, ఒత్తిడి తెచ్చి నవీన్ నిశ్చల్‌ని సస్పెండ్ చేయించి అధిష్టానం దగ్గర తన పలుకుబడిని చాటుకున్నారు పెద్దిరెడ్డి వర్గానికి చెందిన దీపిక . పార్టీకి ఏ మాత్రం బలం లేని హిందూపురం వంటి నియోజకవర్గాల్లో సీనియర్లను కాపాడుకుంటూ బలం పుంజుకోవాల్సింది పోయి ఇలా బటయకు పంపడంపై కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ప్రత్యర్థి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కలిసివస్తుందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక సస్పెన్షన్ తర్వాత మీడియాతో మాట్లాడిన నవీన్ నిశ్చల్ వేరే పార్టీలోకి వెళ్లనని కార్యకర్తలను సంఘటితం చేసుకుంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటుతానని, ఏది ఏమైనా 2029లో పోటీ చేసి తీరతానని మరోసారి పునరుద్ఘాటించారు.. ఓ పెద్ద మనిషి ఎక్కడో కర్ణాటక నుంచి ఒక మహిళను తీసుకువచ్చి లేనిపోనివి తనపై అధిష్టానానికి చెప్పి , తనను సస్పెండ్ చేయించారని పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై నిప్పులు చెరిగారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానినని, ఇప్పటికైనా సస్పెన్షన్ పై పునరాలోచించుకోవాలని అధిష్టానానికి సూచించారు.
నేతల బలనిరూపణలపై రమేష్ రెడ్డి ఆగ్రహం
ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడంతో హిందూపురం వైసీపీ పరిశీలకుడు రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు బలనిరూపణలు చేస్తే సహించమని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్పినట్టుగానే ఇద్దరు కీలక నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేసి దీపిక వర్గానికి లైన్ క్లియర్ చేశారు. ఆ ఎఫెక్ట్‌తో చాప కింద నీరులా కింద స్థాయిలో పనిచేసుకుంటున్న దివంగత చౌలూరూ రామకృష్ణ రెడ్డి సోదరి మధుమతిరెడ్డి కూడా ఇక అలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇలా ఎన్నికల ముగిసి ఏడాది కూడా కాకమునుపే ఇలా పార్టీ బజారున పడడంతో చక్కదిద్దే పని చేయాలి కానీ సస్పెండ్ చేస్తే ఎలా అని కార్యకర్తలు వాపోతున్నారు.
Also Read: డివిడెండ్ బూమ్ అంటే ఏంటి.? డివిడెండ్లు పొందిన భారత టైకూన్లు ఎవరు?
ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు. తనకు ప్రత్యర్థులే లేకుండా ఉండేలా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ను పార్టీలో చేర్చుకున్న బాలకృష్ణ… నవీన్ నిశ్చల్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ బలం ప్రతి ఎన్నికల్లో పెరుగుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి శిబిరం నుంచి ప్రధాన నేతలు వస్తే చేర్చుకోవడానికి అభ్యంతరం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తానికి జగన్ నిర్ణయాలతో హిందూపురంలో బాలయ్యకు అడ్డే లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Story By Rami Reddy, Bigtv