
kadapa : కడపలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని సాయికిరణ్ అనే వ్యక్తిని మహేశ్ కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన పాత బైపాస్ వద్ద జరిగింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ హత్య జరిగింది.
సాయికిరణ్ ది వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం. అతడు కడపలోని ఓ ప్రైవేట్ షోరూంలో పనిచేస్తున్నాడు. సాయికిరణ్ కడపకు చెందిన మహేశ్ నుంచి రూ. 50వేలు అప్పు తీసుకున్నాడని తెలుస్తోంది.ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఆదివారం వాగ్వాదం జరిగిందని సమచారం. ఈ క్రమంలోనే మహేశ్ తన వద్ద ఉన్న కత్తితో సాయికిరణ్‌ను పొడిచాడు. ఆ తర్వాత నిందితుడే బాధితుడిని తన వాహనంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.అయితే అప్పటికే సాయికిరణ్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మహేష్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ హత్యపై చిన్న చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతకుముందు కడప ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో వాలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 14వ డివిజన్ వాలంటీర్‌గా భవానీశంకర్ పనిచేస్తున్నాడు. అలాగే ఎల్‌ఐసీ కార్యాలయంలో డిజిటలైజేషన్ విభాగంలోనూ కూడా పనిచేస్తన్నారు. భవానీ శంకర్‌కు అక్కడే పనిచేస్తున్న మల్లికార్జున్ స్నేహితుడు. అయితే ఇటీవల వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరికీ గొడవలయ్యాయని తెలుస్తోంది.
భవానీ శంకర్‌కు మల్లికార్జున్ ఫోన్ చేసి ఎల్‌ఐసీ కార్యాలయానికి రమ్మని పిలిచాడు.అక్కడికి భవానీ శంకర్ చేరుకోగానే.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో భవానీశంకర్ ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోయాడు. కడప డీఎస్పీ షరీఫ్ ఘటనాస్థలిని పరిశీలించారు.ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.