EV Charging: తెలంగాణలో EV వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఛార్జింగ్ స్టేషన్ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని TG రెడ్కో నిర్ణయించింది. వీటి ఏర్పాటు, ఆపరేషన్, మెయింటెనెన్స్, అప్‌గ్రేడేషన్‌తో పాటు వాణిజ్య నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లకు అప్పగించనుంది. హైదరాబాద్ పరిధిలో 200 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి.
హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. TGSPDCL పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో మరో 169 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రెండు ప్రాజెక్టుల్లోనూ EV వినియోగదారులకు ఛార్జింగ్ టారిఫ్‌ను యూనిట్‌కు 13 రూపాయలుగా నిర్ణయించారు. దీనికి అదనంగా GST చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కాంట్రాక్ట్ కాలం పాటు ఇదే టారిఫ్ అమల్లో ఉంటుందని రెడ్కో స్పష్టం చేసింది.
Also read: ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్ మరింత బలోపేతం కానుంది. పెరుగుతున్న EV మార్కెట్‌కు అనుగుణంగా ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పిస్తూ.. పూర్తి స్థాయి EV ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని TG రెడ్కో VCMD ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. ఇక టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ కానుంది. 169 స్టేషన్ల ప్రాజెక్టుకు సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు 200 స్టేషన్ల ప్రాజెక్టుకు అదే రోజు ఉదయం 11 గంటలకు ప్రీ-బిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి బిడ్ల సమర్పణ ప్రారంభమై.. సెప్టెంబర్ 22న ముగియనుంది. తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు సమర్పించాల్సి ఉంటుంది.పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకు తగ్గట్టుగా ఛార్జింగ్ సౌకర్యాలను విస్తరించడం ద్వారా తెలంగాణలో గ్రీన్ మొబిలిటీకి మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also read: హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !