Kirankumar Reddy or Chiranjeevi: రాజకీయ నేతల మాటలు కత్తుల మాదిరిగా రెండు వైపులా పదును ఉంటుందని తలపండిన నేతల మాట. సిట్యువేషన్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇప్పుడున్న నేతలకు తిరుగులేదు. విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం ఏపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. తన ఫ్యూచరంతా వ్యవ‘సాయ’మేనని చెప్పుకొచ్చి వీఎస్ఆర్.. ఎక్కడ అనేది మాత్రం చెప్పలేదు. ఫారెన్‌లో చేస్తున్నారా? ఈశాన్య రాష్ట్రాల వైపు చూస్తున్నారా అనే ప్రశ్నలు నేతలను వెంటాడుతోంది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు జగన్ ‘ఆర్థిక’ ఆత్మ విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఆయన బీజేపీకి దగ్గరవుతున్నట్లు ఢిల్లీ వార్తల సారాంశం. కొద్దిరోజులుగా బీజేపీ కీలక నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన తర్వాత ఢిల్లీలో తన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి ఢిల్లీలో బీజేపీకి చెందిన ఓ నేత ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ పెద్దలతో మాంచి రిలేషన్ పెంచుకున్నారు. తనను జగన్ ఎలా ఉపయోగించుకున్నారో.. అలాగే వైసీపీ పార్టీని తన ఇమేజ్ కోసం అనుకూలంగా మార్చుకున్నారాయన. ఈ క్రమంలో బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ వ్యవహారశైలి గురించి పూసగుచ్చి మరీ బీజేపీ హైకమాండ్‌కు విజయసాయిరెడ్డి చెప్పారట.
ఈ నేపథ్యంలో తమ మనసులోని మాట బయటపెట్టార వీఎస్ఆర్. తనకు గవర్నర్ కావాలని ఉందని బీజేపీ పెద్దల ముందు చెప్పారట. తొలుత కష్టమని చెప్పినా, చివరకు ఈశాన్య రాష్ట్రాలకు పంపించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వార్తలొస్తున్నాయి.
మరోవైపు వారం కిందట హోంమంత్రి అమిత్ షా విజయవాడకు రావడం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో దాదాపు గంటకు పైగానే చర్చించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు ప్రస్తావించారట. త్వరలో ఏపీలో ఓ ఎంపీ సీటు ఖాళీ అవబోతోందని, ఎవరికి ఇస్తే బాగుంటుందని చర్చించారు. వీఎస్ఆర్ రాజీనామా చేయబోతున్నారనేది సూచనప్రాయంగా చెప్పారట.
ALSO READ: విజయసాయిరెడ్డి అప్రూవర్ అయితే జగన్ జైలుకేనా?
ఖాళీ కాబోయే సీటు ఎవరికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చించారట హోంమంత్రి అమిత్ షా. ఈ క్రమంలో ఇద్దరు నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఒకరు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాగా, మరొకరు చిరంజీవి పేరు బయటకు వచ్చింది. వీరిద్దరిలో బీజేపీ హైకమాండ్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వీఎస్ఆర్ రాజీనామా తర్వాత దీనిపై ఓ క్లారిటీ రావచ్చని కొందరు టీడీపీ నేతల మాట.
ఈ నేపథ్యంలో వైసీపీ ఆఫీసులు, జగన్ ప్యాలెస్‌ల గురించి ఆరా తీశారాయన. అమిత్ షా లాంటి వ్యక్తి జగన్ ప్యాలెస్‌ల గురించి అడిగినప్పుడు చాలామంది డౌట్ వచ్చింది. కాకపోతే మూడు పార్టీల నేతలు పై విషయాలను ఎక్కడా బయట ప్రస్తావించలేదు. తమకేదీ తెలియనట్టుగానే వ్యవహరించారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు బీజేపీ పెద్దలు. గతంలో వెస్ట్ గోదావరిలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం చిరంజీవి వెళ్లారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకలకు చిరంజీవి హాజరయ్యారు.
సింపుల్‌గా చెప్పాలంటే బీజేపీ హైకమాండ్‌కు చాలా దగ్గరగా ఉన్నారు మెగాస్టార్. వీఎస్ఆర్ సీటు అయితే కిరణ్ కుమార్ రెడ్డికి లేదంటే చిరంజీవికి ఇవ్వవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ సీటు గురించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.