2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరు మెల్లగా ఆ పార్టీకి దూరమయ్యారు. చిన్నా, పెద్దా చాలామంది నాయకులు జగన్ ని విమర్శించి పక్కకు వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారిలో ఇద్దరు కీలక నేతలు విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఒకరు జగన్ కి దగ్గరి బంధువు అయితే, మరొకరు ఆత్మబంధువు లాంటివారు. ఇద్దరూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు, అధికారం పోగానే వివిధ కారణాలు వెదుక్కుని మరీ జంప్ అయ్యారు. అయితే వీరిద్దరికీ బయట ఉక్కపోతగానే ఉంది. అలాగని నిన్న వెళ్లిపోయి ఈరోజు తిరిగి రావడమంటే మరీ అవమానం. అందుకే ఆలోచిస్తున్నట్టున్నారు. ఇప్పటి వరకు దీన్ని కేవలం పుకారు అనుకున్నా.. రాబోయే రోజుల్లో ఇదే నిజం అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం.
వ్యవ’సాయి’రెడ్డి పరిస్థితి ఏంటి..?
రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి ఏకకాలంలో రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆయన ఎగ్జిట్ ఎవరూ ఊహించనిది. ఎందుకంటే.. వైఎస్ఆర్ తోనూ, జగన్ తోనూ ఆయనకున్న అనుబంధం అలాంటిది. అయితే 2024 ఎన్నికలకు ముందే విజయసాయిరెడ్డికి వైసీపీలో ఎదురుదెబ్బలు తగిలాయి. రాజ్యసభ సభ్యుడిగా హ్యాపీగా ఉన్న ఆయన్ను తీసుకొచ్చి నెల్లూరు ఎంపీగా పోటీ చేయమన్నారు. ఇష్టం లేకపోయినా ఆ బాధ్యత భుజాన వేసుకుని పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక పార్టీలో సజ్జల ప్రాబల్యం పెరిగిపోవడం కూడా విజయసాయికి ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన కోటరీ అంటూ వ్యాఖ్యలు చేసి బయటకు వెళ్లిపోయారు. ఇతర పార్టీలో చేరతారనే ప్రచారం జరిగినా, తాను వ్యవసాయానికే పరిమితం అవుతానని ఖరాఖండిగా చెప్పారాయన. కానీ ఆ పని కూడా మొదలు పెట్టలేదు. ఆయన ప్రయాణం రాజకీయమేనని తేలిపోయింది. అయితే విజయసాయిరెడ్డికి ఇతర పార్టీల్లో అవకాశం ఉండదు అనే విషయం కూడా తేలిపోయింది. దీంతో ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. జగన్ తో ఆయన కలసి ఉన్న పాత ఫొటోలను కొత్తగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీనుంచే సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నా.. ఆ పార్టీలోకి విజయసాయి రీఎంట్రీని మాత్రం కొట్టిపారేయలేం.
బాలినేని దారెటు..?
2024 ఎన్నికల తర్వాత కూటమి విజయం ఈవీఎంల విజయం అంటూ రచ్చ చేశారు బాలినేని శ్రీనివాసులరెడ్డి. కోర్టులో కేసులు కూడా పెట్టారు. అలాంటి బాలినేని రోజుల వ్యవధిలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువా కప్పుకున్నారు. కానీ జనసేనలో ఆయనకు పెద్ద ప్రయారిటీ దక్కలేదు. ఇటు ప్రకాశం జిల్లాలో బాలినేనికి టీడీపీతో పాత గొడవలున్నాయి. అవి కూడా ఇంకా సద్దుమణగలేదు. బాలినేనిని జనసేన నేతగా ఎవరూ గుర్తించడం లేదు. దీంతో ఆయన ఆ పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ని బాలినేని కలసినా పెద్ద హడావిడి లేదు. ఇలాంటి దశలో బాలినేని తిరిగి వైసీపీ గూటికి చేరతారనే పుకార్లు మొదలయ్యాయి. అంటే ఇక్కడ బాలినేనికి వైసీపీ మినహా వేరే ఆప్షన్ లేదు అనే విషయం తేలిపోయింది.
ముహూర్తం ఎప్పుడు..?
విజయసాయిరెడ్డి, బాలినేని ఆల్రడీ జగన్ ని కలసి మంతనాలు సాగించారని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారనే టాక్ వినపడుతోంది. అయితే ఈ వార్తల్ని పూర్తిగా నమ్మలేం. ఇక విజయసాయిరెడ్డి, బాలినేని వర్గాలు కూడా ఈ వార్తల్ని ఖండించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. వారిద్దరూ నిజంగానే తిరిగి వచ్చేస్తారా..? వచ్చేస్తే వైసీపీలో వారికి పునర్వైభవం దక్కుతుందా..? జగన్ మళ్లీ తన కోటరీలోకి తీసుకుంటారా..? సజ్జలతో విజయసాయి, వైవీ సుబ్బారెడ్డితో బాలినేని అడ్జస్ట్ కాగలరా..? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.