Vijayasai Reddy: సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి రూటు మార్చారా? బీజేపీ సానుభూతి పరుడు అనే ముద్ర పొగొట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? అందుకే డీలిమిటేషన్ వ్యవహారాన్ని తలకెత్తుకున్నారా? ఆయన ట్వీట్ వెనుక తాజా రాజకీయాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి.
రూటు మార్చిన వీఎస్ఆర్
దశాబ్దాంపాటు రాజకీయాల్లో కొనసాగిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటామని మీడియా సాక్షిగా వెల్లడించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో వీఎస్ఆర్ శకం ముగిసిందని చాలామంది రాజకీయ నేతలు భావించారు. ఈ పరిణామాలు వెనుక ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
గవర్నర్ పదవి కోసం ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ లేకపోలేదు. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. కాకినాడ సీ పోర్టు వ్యవహారంపై మీడియా ముందు కొచ్చిన ఆయన, ఫ్యాన్ పార్టీ గురించి చెప్పాల్సిన విషయాలన్నీ బయటపెట్టారు. ఆయన మాటలపై వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
ఇంకా ఆ వివాదం సద్దుమణగక ముందే కొత్త పల్లవిని ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలను బయటపెట్టారు విజయసాయిరెడ్డి. డీలిమిటేషన్‌పై కీలక విషయాలు వెల్లడించారు ఆయన. ఈ విషయంలో బీజేపీ తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు.
ALSO READ: ప్రవేశ దర్శనం టికెట్లు రిలీజ్.. కొత్త ఛైర్మన్ ఫస్ట్ బడ్జెట్
డీలిమిటేషన్‌పై ఆశక్తికర కామెంట్స్
దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేందుకు దక్షిణాది పార్టీలు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో పార్టీల మద్దతు కోరుతూ శనివారం తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిల పక్ష సమావేశం నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ డీలిమిటేషన్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
డీలిమిటేషన్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన. కేవలం జనాభాపై ఆధారపడిన డీలిమిటేషన్ దక్షిణాదికి నష్టం కలిగిస్తుందన్నారు. దక్షిణ రాష్ట్రాల ఆందోళనలతో అంగీకరిస్తున్నానని అన్నారు. ఆందోళనలు న్యాయమేనని తెలిపారు. హోం మంత్రి అమిత్ షా దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క సీట్లు కోల్పోదన్నారు. ఈ విషయంలో న్యాయమైన పెంపుదల జరుగుతుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారాయన.
అంతేగాక స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల జేఏసీ పోరాడేందుకు ముందుకు రావడం శుభపరిణామంగా వర్ణించారాయన. ఆంధ్రప్రదేశ్‌లో 4.6 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 14.7 శాతం లోక్‌సభ స్థానాలు ఉన్నాయని అన్నారు. వీటిలో ఏదైనా పెరిగితే కొత్త లోక్‌సభలో అదే శాతాన్ని కొనసాగించాలన్నారు.
కోట్లాది మంది భారతీయులు తమ రాష్ట్రం వెలుపల నివసిస్తున్నారని, అందువల్ల కేవలం జనాభాపై ఆధారపడటం సాధ్యం కాదన్నారు. మరో పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేయాలని సూచించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రాలలో ఎమ్మెల్యే సీట్లు కూడా పెరగాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సూచనతో తాను కూడా ఏకీభవిన్నానని వెల్లడించారు విజయసాయి రెడ్డి.
మొత్తానికి సాయిరెడ్డి వ్యవహారశైలిని గమనించినవాళ్లు మాత్రం.. ఏదో విధంగా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. వ్యవసాయం-రాజకీయాలు దేని పని దానిదేనని అంటున్నారు ఆయన మద్దతుదారులు. మొత్తానికి వీఎస్ఆర్ రాజకీయాల్లో క్రమంగా యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోందన్నమాట.