Janasena Party: విజయవాడలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి సమక్షంలోనే సొంత పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడటం గమనార్హం.
విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ, పార్టీ నేత రావి సౌజన్య మాట్లాడుతూ.. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని రామ్ తాలూరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆమె మాట్లాడుతున్న సమయంలోనే ఇతర నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెపై ఎదురుదాడికి దిగారు. సౌజన్య పార్టీ ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, తోపులాటకు దారితీసింది.
నేతల మధ్య గొడవను వీడియో తీస్తున్న బిగ్ టీవీ (Big TV) కెమెరామన్‌పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. కెమెరాను లాక్కొని, వీడియోలు తీయవద్దంటూ దుర్భాషలాడారు. తోటి మీడియా మిత్రులందరూ దీనిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే జోక్యం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామాన్య ఉదయభాను, దాడికి పాల్పడిన నేతలతో మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన గైడ్ లైన్స్ జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.
కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, పార్టీలో తమకు తగిన గుర్తింపు లభించడం లేదని పలువురు కార్యకర్తలు ఈ సందర్భంగా నేతల ముందు మొరపెట్టుకున్నారు.
Read Also: Addanki Counter: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి