Visakhapatnam IT Companies: విశాఖ ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రిషికొండ, మధురవాడ ప్రాంతాల్లోని ఐటీ సెజ్‌లలో వందల కోట్ల విలువైన భూములను కంపెనీలకు కేటాయించింది. లక్ష్యం ఒక్కటే.. భారీ పెట్టుబడులు తీసుకురావడం.. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం.
అయితే రిషికొండ హిల్ నెంబర్-3లో ఓ ఐటీ కంపెనీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 3.6 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ కంపెనీకి కేటాయించింది. బహిరంగ మార్కెట్‌లో ఎకరం ధర దాదాపు 40 కోట్ల వరకు ఉండగా.. పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా ఎకరాకు కోటి రూపాయలకే ఇచ్చినట్లు చెబుతున్నారు. 1500 కోట్ల పెట్టుబడితో.. వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కంపెనీకి గత అక్టోబర్‌లో మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. కానీ నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు భవన నిర్మాణ అనుమతుల కోసం కంపెనీ చేసిన దరఖాస్తులోని కొన్ని అంశాలు వివాదానికి కారణమయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులతో పాటు.. భవనానికి అవసరమైన పార్కింగ్‌ను కూడా ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని కోరినట్లు సమాచారం. ఐటీ కంపెనీల రాకతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఆశలు పెరిగాయి. కానీ ప్రాజెక్టుల ఆలస్యం, కొత్త షరతులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విశాఖ ఐటీ సెజ్‌లో వివాదానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందన్నది ఆసక్తిగా మారింది. కంపెనీలు స్పీడ్ పెంచుతాయా..? లేక డిమాండ్లతో మరింత ఆలస్యం అవుతుందా..? చూడాలి.
Also Read: వైసీపీ సవాల్‌కు సై.. పదింతలు పనిచేసి చూపిస్తా! మంత్రి నారాయణ మాస్ కౌంటర్