Visakha Railway Station: రాబోయే ఐదేళ్లలో దేశంలోని కీలక నగరాల్లో రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైళ్ల సంఖ్య రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమృత్ భారత స్టేషన్లలో భాగంగా ఏపీలో 70 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలో రూ.500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రానున్న రోజుల్లో విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
విశాఖ రైల్వే స్టేషన్‌ను రూ.500 కోట్లతో ఎయిర్ పోర్టు తరహాలో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు పనులపై విశాఖ ఎంపీ భరత్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. విశాఖ రైల్వేస్టేషన్ వెస్ట్ సైట్ ప్రస్తుతం నూతన బిల్డింగ్ లు నిర్మిస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. అలాగే ప్లాట్‌ఫారాల సంఖ్యను 8 నుంచి 14కు పెంచనున్నట్టు ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని రైల్వే వర్గాలు తెలిపాయన్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రోజుకు 37 రైళ్లు వెళ్తుంటాయి. రానున్న ఐదేళ్లలో ఈ సంఖ్యను 74కు పెంచనున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు విశాఖపట్నం నుంచి కొత్త రైళ్లు నడపనున్నారు. సికింద్రాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, దిల్లీ, కోల్‌కత్తా, రాయపూర్‌తో పాటు అరకు లోయ పర్యాటక ప్రాంతాలకు అదనపు రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతి, బెంగళూరుకు వందే భారత్ ఎక్స్ ప్రెస్, కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉంది.
విశాఖ స్టేషన్ లో రద్దీ పెరగడంతో.. పలు రైళ్లు దువ్వాడ దాటిన తర్వాత అవుటర్ లో ఉంచుతున్నారు. పలు రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నారు. దీంతో మెయింటెనెన్స్ ఇబ్బందిగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కొత్తవలస-అనకాపల్లి మార్గంలో జగన్నాథపురం వద్ద శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే వర్గాలు ప్రతిపాదించాయి.
“రైల్వే స్టేషన్ వెస్ట్ సైడ్ భారీ బిల్డింగ్ నిర్మిస్తు్న్నారు. 350 కార్లు, 1500 బైక్ లకు పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 8 ఫ్లాట్ ఫారాలను 14లకు పెంచి16 రైల్వే లైన్లు వచ్చే విధంగా చేయనున్నారు. వెస్ట్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ పూర్తైన తర్వాత.. ప్రస్తుత బిల్డింగ్ పునర్ నిర్మించనున్నారు. ఈ రెండింటిని కనెక్ట్ చేసేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఏరో బ్రిడ్జిని నిర్మించనున్నారు” – ఎంపీ భరత్