Tirumala News: వరుస కేసులు వైసీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఓ వైపు లిక్కర్.. మరోవైపు నకిలీ లిక్కర్ కేసులు.. ఇప్పుడు పరకామణి చోరీ కేసు నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు నేతలకు సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వచ్చేవారంలో వారంతా సీఐడీ ముందు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. విచారణ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. వచ్చేనెల రెండులోపు నివేదిక హైకోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది.
పరకామణి చోరీ కేసు విచారణ మొదలు
తిరుమలలో శ్రీవారి హుండీ (పరకామణి చోరీ కేసు దర్యాప్తు మొదలైంది. కేవలం నాలుగు వారాలు మాత్రమే గడువు ఉండడంతో విచారణ వేగవంతం చేసింది ఏపీ సీఐడీ. 20 మంది సభ్యులతో కూడిన ఐదు టీమ్‌లు దర్యాప్తులో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే విచారణ మొదలు పెట్టినట్టు తెలిపారు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.
ఈ కేసులో అప్పటి టీటీడీ పాలకమండలి, అధికారులు, అవసరమనుకుంటే వివిధ పార్టీల నేతలను విచారించే అవకాశమున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే చాలామందికి నోటీసులు ఇచ్చామని సీఐడీ డీజీ తెలిపారు. ఈ కేసులోని కీలక నిందితుడు రవికుమార్ హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
విచారణకు రావాలని సీఐడీ నోటీసులు
అతడి కోసం సీఐడీ వేట మొదలుపెట్టింది. నిందితుడికి తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, తిరుపతిల్లో ఆస్తులున్నట్లు తెలుస్తోంది. వాటిపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఇటీవల టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి స్వయంగా పరకామణి చోరీకి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు బయట పెట్టారు. దీనిపై సీఐడీ విచారణ చేపడితే మరిన్ని వివరాలు అందజేస్తానని చెప్పిన విషయం తెల్సిందే.
ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలీదు. కాకపోతే రీసెంట్‌గా ఆయన బయటపెట్టిన ఫుటేజీని మాత్రం సీఐడీ తీసుకునే అవకాశముంది. ఈ తతంగం వెనుక ఆనాడు వైసీపీ పెద్దలు ఉన్నారని అధికార పార్టీకి చెందిన నేతలు పదేపదే ఆరోపణలు గుప్పించింది. వారిలో కొందరికి సీఐడీ నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
ALSO READ: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
ఐదు బృందాలతోపాటు 10 మందితో టెక్నికల్, లీగల్, ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేసింది సీఐడీ. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్, ఈవోలు ఈ కేసులో పూర్తి సహకారం అందించేందుకు రెడీగా ఉన్నట్లు అయ్యన్నార్ తెలిపారు. 1985 లో టీటీడీలో చేరాడు రవికుమార్. ఆనాటి నుంచి అతడి పని తీరు, సహకరించిన అధికారుల పాత్రపై లోతుగా విచారణ చేస్తామని తెలిపారు.
రవికుమార్‌తో సంబంధాలున్న వారికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్‌లు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయో తేలుతుందన్నారు. రవికుమార్ స్థిర,చరాస్తులు, బ్యాంకు లావాదేవీలు ఫోకస్ చేశారు. ఆస్తుల విక్రయాలు, బహుమానంగా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్, ఇతర అంశాలపై లోతుగా విచారణ మొదలైంది. దర్యాప్తు వివరాలను డిసెంబర్ 2న హైకోర్టుకు అందజేయనుంది సీఐడీ.