మంత్రి నారా లోకేష్, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కి విశేష స్పందన లభించింది. 4వేల మంది వివిధ ప్రాంతాలనుంచి పార్టీ ఆఫీస్ కి వచ్చి లోకేష్ తో తమ కష్టాలు చెప్పుకున్నారు. వారి కష్టాలన్నీ ఓపిగ్గా విన్న లోకేష్, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి పంపించారు. ఈ ప్రజా దర్బార్ పై వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతున్న వేళ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా దర్బార్ విజయవంతం అయిందని అంటూనే, అదే సమయంలో స్థానిక నేతలు కాస్త అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు పరిష్కరించగలిగితే వారంతా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చేవారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో స్థానిక నేతలు మరింత చురుగ్గా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
అదీ పాయింటే కదా..?
ప్రతిపక్షంలో ఇబ్బందులు పడి ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో చాలామంది ఎమ్మెల్యేలు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారనే అపవాదులున్నాయి. కొంతమంది ప్రజలకు, స్థానికులకు అందుబాటులో లేరని అంటున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం నెలకోసారి పేదల కోసం అంటూ పెన్షన్ల పంపిణీతో ప్రజల్లోకి వస్తున్నారు. ఒక శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంద్ర పేరుతో మళ్లీ ప్రజల ముందుకొస్తున్నారు. అధినేత ఇంత ఉత్సాహంగా ఉంటే, కిందిస్థాయి నాయకులు ఇంకెంత హుషారుగా ఉండాలి. కానీ టీడీపీలోని కొంతమంది నేతల్లో ఆ హుషారు తగ్గిందనే అపవాదు ఉంది. అందుకే ఏపీటీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కింది స్థాయిలో నేతలు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని సూచించారు.
టీడీపీ అలర్ట్..
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ప్రజతో మమేకం కాకపోవడం అనే అపవాదు ఉంది. సీఎం హోదాలో జగన్ కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చేవారు కాదట, అలాంటిది ఆయనకు జనాల్ని కలిసే టైమ్ ఎక్కడ ఉంది. ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రం మొత్తం సిద్ధం పేరుతో సభలు పెట్టారు కానీ జనాల్లోకి వెళ్లలేకపోయారు. కానీ టీడీపీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే సీఎం చంద్రబాబు ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆయనతోపాటు మంత్రి నారా లోకేష్ కూడా తన నియోజకవర్గం మంగళగిరితోపాటు, ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా ప్రజల్ని కలిసే విధంగా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజా దర్బార్ కూడా అందులో భాగమే. నేతలంతా ఇలానే ఆలోచిస్తే, ఇలానే ప్రజల్లో ఉండగలిగితే 2029లో కూడా కూటమి విజయం నల్లేరుపై నడక అని చెప్పుకోవాలి. అయితే ఆ స్థాయిలో కింది స్థాయి నేతలు చురుగ్గా ఉన్నారా అనేదే అసలు ప్రశ్న. ఇప్పట్నుంచే నాయకుల్నిఆ దిశగా ప్రోత్సహిస్తోంది టీడీపీ. నిత్యం జనాల్లో ఉండాలని, జనాలకు దగ్గరగా ఉండి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచిస్తోంది.
Also Read: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్