AP politics: వైసీపీకి అస్సలు కాలం కలిసిరావడం లేదు. కీలక నేతలకు మాత్రమేకాదు.. చివరకు మాజీ మంత్రులకు అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలామంది నేతలపై నమోదు అయ్యాయి. తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు నమోదైంది. ఈ విషయం తెలియగానే వైసీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరిగింది? ఎందుకు కేసు నమోదు అయ్యింది?
ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయి రెండేళ్లు గడిచింది. ఇప్పటివరకు ఫైర్‌బ్రాండ్ నేతలపై కేసులు నమోదయ్యాయి. డబుల్ షూటర్లగా పేరు పొందిన నేతల వంతైంది. తాజాగా శ్రీకాకుళం మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుపై ఆ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. గృహ నిర్మాణశాఖ డీఈఈ సత్యాజీ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
శ్రీకాకుళంలోని కుందువానిపేట గ్రామంలో హుద్‌హుద్ తుపాను సమయంలో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. సుమారు 250 మందికి ఇళ్లను అప్పగించింది. కొందరికి ఇంకా ఇవ్వాల్సివుంది. అయితే పంపిణీ సమయంలో లబ్ధిదారులు లేని కారణంగా కొన్నింటిని పెండింగ్‌లో పెట్టారు. వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు కలెక్టర్‌ను కలిసి ఇళ్లు అప్పగించాలని విన్నవించారు.
మే 14న ఆ గ్రామాన్ని సందర్శించారు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయనతోపాటు జడ్పీటీసీ సభ్యురాలుతోపాటు పలువురు నేతలు ఉన్నారు. వైసీపీకి మద్దతుగా ఉన్న ఆరుగురు మత్స్యకారులతో బలవంతంగా గృహ ప్రవేశాలు చేయించారు. ఈ విషయం ప్రభుత్వంతోపాటు అధికారుల దృష్టికి వెళ్లింది. జిల్లా హౌసింగ్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ విషయం తెలియగానే వైసీపీలో కీలక నేతలు షాకయ్యారు. అసలు పరిస్థితులు బాగా లేనప్పుడు దూకుడుగా వెళ్లడం ఎందుకని అంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది ఆ పార్టీ. చీటికీమాటికీ కేసు నమోదు చేసి నేతలను అధికార పార్టీ భయపెడుతోందని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు గురించి చెప్పనక్కర్లేదు. నిత్యం మీడియా ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తం కాదు.
ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?
సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన మాటలు ఉంటాయి. ఈ విషయం ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. నేతలపై కేసులు నమోదు కావడం సహజమేనని, కాకపోతే ఎన్నికల సమయంలో ఈ కేసులు ఎక్కడ ఇబ్బందిపెడతాయోనని భయం పడుతున్నారు. ఇప్పటిపై వైసీపీ ఫైర్‌బ్రాండ్ నేతలపై కేసులు నమోదైన విషయం తెల్సిందే.