YS Sharmila on TDP: ఏపీ బడ్జెట్ లో ప్రజలకిచ్చిన హామీలపై తగిన నిధులు కేటాయించాలని, వెంటనే ప్రభుత్వ పథకాలను అమలు చేసి తీరాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ డిమాండ్ చేశారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంధర్భంగా షర్మిళ పలు డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే ఇటీవల మాజీ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న ఆమె, ఈసారి తన విమర్శల బాణాన్ని కూటమిపైకి ఎక్కుపెట్టారు. హామీలు ఇచ్చారు సరే, వాటి అమలు ఎక్కడా అంటూ ఆమె ట్వీట్ చేశారు.
షర్మిళ చేసిన ట్వీట్ ఆధారంగా.. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరమన్నారు. ప్రజల అంచనాలకు భిన్నంగా 30 మోసాలు, 60 అబద్ధాలు అనే సామెతను తలపించిందన్నారు. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. కూటమి కరపత్రాన్ని చదివించారని ఆమె విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప.. మ్యానిఫెస్టో హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన ఎక్కడా లేదన్నారు. 8 నెలలు దాటినా ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేదని, సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదన్నారు. జాబ్ క్యాలెండర్ లాంటి మిగతా హామీలపై అసలు ప్రస్తావనే లేదని, రాష్ట్ర పునర్మిర్మాణం అంటూ కాలయాపన తప్ప.. పథకాలను అమలు చేస్తారని ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని అన్నారు.
రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అబద్ధాలు చెప్పారు. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామని అభూత కల్పన సృష్టించారన్నారు. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ భర్తీ చేయకుండా ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యా, వైద్య రంగాలను ఉద్ధరించినట్లు అసత్యాలు పలికారని తెలిపారు. గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే, రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉందని చెప్పడం శుద్ధ అబద్ధమని, జలయజ్ఞం కింద చేపట్టిన దాదాపు 30 ప్రాజెక్టులు దశాబ్ద కాలంగా మూలుగుతుంటే వాటిని పూర్తి చేసే చిత్తశుద్ది కూడా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు.
రూ.3 వేల నిరుద్యోగ భృతి కోసం 50 లక్షల మంది యువత.. 84 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారని షర్మిళ అన్నారు. ఎకరానికి రూ.20 వేలు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కోసం 54 లక్షల మంది రైతులు, ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకం కోసం కోటి మంది మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. పేదవాళ్లకు సొంత ఇంటి కోసం చేపట్టిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం లేదని, అందుకే ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజల ఆశయాలకు అద్దంపట్టేలా ఉండాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేసేలా నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు షర్మిళ ట్వీట్ చేశారు.
Also Read: Pawan Kalyan: ఇటువైపు రావద్దు.. వైసీపీకి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..
షర్మిళ చేసిన ట్వీట్ లో వైసీపీని ఉద్దేశించి విమర్శించక పోవడం విశేషం. ఇటీవల ఏ ట్వీట్ చేసినా, అందులో తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వ పాలన గురించి విమర్శలు చేసే షర్మిళ కాస్త గ్యాప్ ఇచ్చారని చెప్పవచ్చు. మొత్తం మీద ఏపీలో పథకాల అమలు గురించి ప్రజలు ఎదురు చూపుల్లో ఉన్నారని, ఇప్పటికైనా కూటమి అమలుకు చర్యలు తీసుకోవాలని మాత్రమే ట్వీట్ ద్వారా షర్మిళ డిమాండ్ చేశారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం పూర్తిగా సత్యదూరం. ప్రజల అంచనాలకు భిన్నంగా 30 మోసాలు, 60 అబద్ధాలు అనే సామెతను తలపించింది. గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించారు. కూటమి కరపత్రాన్ని చదివించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్పా.. మ్యానిఫెస్టో హామీల అమలుపై స్పష్టమైన…
— YS Sharmila (@realyssharmila) February 25, 2025