Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వంకు వచ్చిన కష్టమేమీ లేదని, రానున్న 15 ఏళ్లు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఏపీ శాసనసభలో మంగళవారం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మరో మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా సీరియస్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్షం అనేది లేదని, ప్రజలు అందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ లక్ష్యమని, ఏపీ ప్రజల పక్షాన ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం ఉంటుందన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గవర్నర్ కు విలువ ఇవ్వని పార్టీకి అసెంబ్లీలోకి వచ్చే అర్హత లేదన్నారు. వైసీపీ సభ్యులు కావాలనే రాద్దాంతం చేసి గవర్నర్ ప్రసంగ ప్రతులను చించివేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు చక్కని నిదర్శనమే వారికి వచ్చిన 11 సీట్లు అంటూ పవన్ కళ్యాణ్ మరో మారు అసెంబ్లీలో వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని, రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేస్తుందన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో ప్రతి పథకం అమలవుతుందని, రాష్ట్ర ప్రజలకు పవన్ భరోసానిచ్చారు. చిన్నచిన్న కుటుంబాలలోనే ఎన్నో సమస్యలు ఉంటాయని, కూటమిలో ఉన్న సమస్యలను తాము కూర్చొని చర్చించుకుంటామంటూ పవన్ చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం అంటేనే ఒక ఛాలెంజ్ అంటూ ప్రసంగించిన పవన్.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్డీఏ కూటమి కలిసి ఉంటుందంటూ తేల్చి చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని, విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు కూటమి ఎప్పుడు ముందుంటుందన్నారు.
కాగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగిస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు తదేకంగా పవన్ ను చూస్తూ చిరునవ్వులు చిందించారు. పోలవరానికి నిధులు సాధించడంలో సీఎం సక్సెస్ అయ్యారని పవన్ అనగానే, సభికులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. మొత్తం మీద అసెంబ్లీ వేదికగా పవన్ తన ప్రసంగంలో 15 ఏళ్లు అధికారంలో కూటమి ఉంటుందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అంతేకాకుండా కూటమిలో ఉన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని పవన్ కామెంట్స్ వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అంటూ చర్చ సాగుతోంది.
Also Read: AP Govt Schemes: ఏపీలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ స్కీమ్స్.. అధికారికంగా ప్రకటించిన లోకేష్
పవన్ ప్రసంగం పూర్తి కాగానే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో పవన్ చూపిన చొరవ అభినందనీయమన్నారు. కేంద్రం కూడా సకాలంలో స్పందిస్తోందని, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ది వైపు పరుగులు పెట్టడం సాధ్యం కాదన్నారు. అయితే వైసీపీ సభ్యులను అసెంబ్లీ వైపు అనుమతించరాదని. పవన్ చేసిన కామెంట్స్ పై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.