YS Sharmila: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. ఆయన ప్రసంగం అంతా డొల్లగా ఉందన్న షర్మిల.. రాష్ట్ర అభివృద్ధిపై దశ – దిశ లేదని ఆరోపించారు. అంతా అవాస్తవాలు, కల్పితాలతో నిండిపోయిందని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోకు మెరుగులద్ది చదివినట్లుందని ఎద్దేవా చేశారు. 19 నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అటు బడ్జెట్ సమావేశాల నుంచి వాకౌట్ చేయండంపై వైసీపీ అధినేత జగన్ పైనా షర్మిల ఫైర్ అయ్యారు.
కూటమి ప్రభుత్వ పాలన తీరుపై గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చెప్పించినవన్నీ పచ్చి అబద్ధాలను షర్మిల దుయ్యబట్టారు. ‘పునర్ నిర్మాణం పేరుతో ఇంకా పబ్బం గడపడం తప్పా ప్రసంగంలో కొత్తదనం లేదు. కూటమి ప్రభుత్వానికి విజన్ లేదు, విజ్డం లేదు. సుపరిపాలన లేదు.. సమతూకం అంతకన్నా లేదు. కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్. 33 వేల కోట్లతో సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామనేది బూటకం. నిరుద్యోగులకు నెలకు 3 వేలు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి హామీ పత్తా లేదు’ అని షర్మిల మండిపడ్డారు.
అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు కూటమి టోకరా పెట్టిందని షర్మిల ఆరోపించారు. ‘తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు మోసం చేశారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారు. గోడ క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రాదు. కోటి మంది మహిళలకు నెలకు 15 వందలు ఇచ్చే ఆడబిడ్డ పథకానికి దిక్కులేదు కానీ 5 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తున్నామని చెప్పడం పూర్తిగా హాస్యాస్పదం. P4తో పేదరికం అరికట్టడం అనేది పచ్చి మోసం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా అభూత కల్పన’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని చంపేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.43 కోట్ల కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్ష చేశారని విమర్శించారు. ‘పోలవరం ఎత్తు 41.15 తగ్గించి జీవనాడిలో జీవం తీశారు. పెండింగ్ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికి సైతం పట్టింపు లేదు కానీ రాష్టానికి గుదిబండలా మారే పోలవరం – నల్లమలసాగర్ పై అమిత ప్రేమ చూపిస్తున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత అంటూ చేస్తున్నవి డ్రామాలు తప్పిస్తే.. చేతలు మాత్రం ఆమడ దూరం. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్ సిటీల పేరుతో ఇతర హబ్ ల పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం తప్పా ఆచరణ నేటివరకు శూన్యం’ అని షర్మిల అన్నారు.
ట్రూ అప్ పేరుతో రూ.15 వేల కోట్ల భారం మోపి, ట్రూ డౌన్ తో రూ.4 వేల కోట్లు తగ్గించి ఉద్ధరించామని చెప్పడం సిగ్గుచేటని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవస్థ అభివృద్ధికి ఊతం ఇచ్చిన MGNREGAను కాదని VB G- RAM G పథకం గొప్పగా ఉందనడం కూటమి ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనం. రాష్ట్రంలో సగటున 52 రోజుల పనికి దిక్కులేదు కానీ 125 రోజులతో ఉపాధికి ఊతం ఇస్తామనడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. టమాటో, ఉల్లి రైతులు కిలో రూపాయికి అమ్ముకున్నా పట్టింపు లేనోళ్లు.. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ఆదుకున్నాం అని చెప్పడం అత్యంత దారుణం. ఎరువులు ఇవ్వని చేతకానితనాన్ని కప్పి పుచ్చేందుకు భూసారాన్ని పెంచే చర్యలని గొప్పలు చెప్పడం కూటమి పాలన వైఫల్యానికి అద్దం పడుతుంది’ అని షర్మిల విమర్శించారు.
మరోవైపు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విపక్ష వైసీపీ పైనా షర్మిల విమర్శలను ఎక్కుపెట్టారు. ‘కూటమి పాలన వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన అవకాశం వైసీపీకున్నా.. ఈసారి సైతం ప్రతిపక్షం ఇస్తేనే సభ ముందుకు అని చెప్పడం అత్యంత సిగ్గుచేటు. ఒక్క రోజు మురిపానికి కాదు కదా ప్రజలు ఓట్లేసి గెలిపించింది?. మైకు ఇస్తేనే అంటూ మారం చేయడానికి కాదు కదా అసెంబ్లీకి పంపింది? జగన్ గారు సొంత అజెండాను పక్కకు పెట్టి, ప్రజల అజెండాతో అసెంబ్లీకి వెళ్లాలి. కూటమి హామీలపై, నిర్లక్ష్యాలపై సభావేదికగా అధికార పక్షాన్ని నిలదీయాలి. శాసనసభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి. ఆయన తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి’ అని షర్మిల విమర్శించారు.
Also Read: Jagga Reddy: పోలీసులతో వాగ్వాదం.. సీసీ ఫుటేజీ స్వాధీనం.. జగ్గారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?