Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు కష్టాలు రెట్టింపు అయ్యాయా? భూకబ్జా కేసులో ఆయనతోపాటు ఫ్యామిలీ కూడా ఇరకాటంలో పడిందా? భూమి యజమాని బతికి ఉండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించారా? ఈ యవ్వారంలో మాజీ స్పీకర్ తోపాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు అయ్యిందా? ఈ కేసు సీతారాం మెడకు చుట్టుకోవడం ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కష్టాల్లో మాజీ స్పీకర్ ఫ్యామిలీ-మాజీ స్పీకర్, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల్లో తమ్మినేని సీతారాం ఒకరు. ఆయన మాటలు తూటాల మాదిరిగా ప్రత్యర్థులకు గుచ్చుకుంటాయి. ఎవరు ఏమన్నా ఏ మాత్రం పట్టించుకోరు. పైకి ఎంతో హుందాగా కనిపించే ఆయన, భూకబ్జా కేసులో అడ్డంగా దొరికిపోయారు. తమ్మినేని సీతారాంతోపాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు శ్రీకాకుళం జిల్లా రూరల్ పోలీసులు.
భూకబ్జా కేసులో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ-వైసీపీ పాలనలో తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు సుమారు 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేసినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. భూ యజమాని బతికుండగా చనిపోయినట్టు పత్రాలు సృష్టించారు. నకిలీ వారసులను చూపించి తప్పుడు పత్రాలతో తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఆ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
తీగ లాగిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు-ఈ తతంగమంతా తమ్మినేని స్పీకర్‌గా ఉన్నప్పుడు జరిగింది. ఇటీవల ల్యాండ్ ఓనర్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని సీతారాం-ఏ6, ఆయన భార్య వాణి-ఏ7, కొడుకు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్-ఏ5 పేరిట కేసు నమోదు చేశారు శ్రీకాకుళం రూరల్ పోలీసులు. ఆదివారం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
పరారీలో తమ్మినేని, ఆయన కుటుంబసభ్యులు-ఈ కేసులో 13 మంది ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. 8 మందిని అరెస్టు చేసిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారి నుంచి నకిలీ రబ్బరు స్టాంపులు, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. తమ్మినేనితోపాటు ఆయన కుటుంబసభ్యులు, మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.
తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కొడుకు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి అరుణ (ఈమె హిరమండలం సబ్ రిజిస్ట్రార్), త్రినాథ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో వారిని అరెస్టు చేస్తామని వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిధిలో చాపురం గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 35/13లో 900 గజాల స్థలాన్ని గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి కట్టా కనకలింగేశ్వరరావు రెండు దఫాలుగా కొనుగోలు చేశారు.
అసలు భూకబ్జా వ్యవహారం ఎలా పడింది?లింగేశ్వరరావు ఫ్యామిలీ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో సెటిలైంది. ఆ స్థలం ఖాళీగా ఉండడంతో దానిపై కన్నుపడింది. ఆ స్థలం విలువ మార్కెట్లో 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా. లింగేశ్వరరావుకు భూమిని విక్రయించిన గోవిందరాజుల లింక్ డాక్యుమెంట్‌లను పైకి తీసి ఆయన చనిపోయినట్లు తప్పుడు పత్రాన్ని సృష్టించారు.
గోవింద రాజులుకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఒడిశాలోని జయపూర్ ప్రాంతానికి చెందిన రజనిని అనే మహిళను తెరపైకి తెచ్చారు. గోవిందరాజులకు ఏకైక వారసురాలుగా ఆమెని చూపించారు. రెవెన్యూ అధికారుల నుంచి పత్రాలను రెడీ చేశారు. వాటితో ఆమదాలవలస సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ్మినేని సీతారాం కొడుకు చిరంజీవికి విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ చేయించారు.
ALSO READ: మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!
సీతారాంకు చెందిన నలుగురు లెక్చరర్లను సాక్షులుగా సంతకం చేయించారు. ఇంతవరకు కథ బాగానే సాగింది. ఇక్కడి నుంచి అసలు విషయం బయటపడింది. ఆ స్థలానికి ప్రహరీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుండగా అసలు యజమాని కనకలింగేశ్వరరావు కొడుకు జైకిశోర్ పోలీసులను ఆశ్రయించాడు.
తమ వద్ద పత్రాలను పోలీసులకు అందజేయడంతో లోతుగా విచారణ చేపట్టారు. దీంతో భూకబ్జా కేసు వెలుగులోకి వచ్చింది. ఎంతో నిజాయితీగా ఉండే తమ్మినేని సీతారాం ఒక్కసారి భూకబ్జా కేసులో చిక్కుకోవడం నియోజకవర్గం ప్రజలకు మింగుడుపడడం లేదు. ఈ వ్యవహారం నుంచి ఏ విధంగా ఆయన బయటపడతారో చూడాలి.