ఏపీలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2021లో నాటి వైసీపీ హయాంలో నిర్వహించిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పదవీ కాలం ముగియనుంది. అనంతరం మరోసారి ఓటర్ జాబితా సవరణ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ, సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల ఖరారు అనంతరం ఎన్నికలను ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. అయితే, ఎన్నికల నిర్వహణకు మరో ఆరు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇదిలాఉండగా, లోకల్ బాడీ ఎన్నికల ముందు ప్రతిపక్ష వైసీపీ అయోమయంలో పడినట్టు ప్రచారం జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ కార్యకర్తల్లో నిస్తేజం కనిపిస్తోంది. అధిష్టానం నుంచి ఎన్నికల ప్రిపరేషన్ కోసం ఎటువంటి ముందస్తు కార్యాచరణ రాకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నట్టు తెలుస్తున్నది. మాజీ సీఎం జగన్ ఎన్నికల కోసం కసరత్తు చేయాలని కీలక నేతలకు ఆదేశాలు జారీ చేయగా.. వారు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు రివీల్ చేయకుండా అభ్యర్థుల ఎంపిక, నిజమైన కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కిందిస్థాయి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉండగా, మాజీ మంత్రుల వద్ద కొందరు కీలక నేతలు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. తమ వర్గం వారికి, కుటుంబీలకు సీట్లు కేటాయించాలని కోరుతున్నట్టు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ ఆలోచనలో పడినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. గతంలో పెద్దఎత్తున సంక్షేమ ఫలాలు అమలు చేసినా పార్టీ ఓటమి చెందడం ఆయన్ను తీవ్రంగా కలచివేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?కేడర్‌ను ఎలా సిద్ధంచేయాలి? మాజీమంత్రులు, నియోజక ఎన్నికల ఇన్ చార్జులు, పరిశీలకుల నియామకంపై ఆయన సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండే నేతలకే ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని కిందిస్థాయి కేడర్ నుంచి అధిష్టానానికి విజ్ఞప్తులు వస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు ఇంకా పడలేదా.. త్వరగా ఇలా చేయండి..?
స్థానిక ఎన్నికల మీద మాజీ సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతున్నది.ఎందుకంటే అధికార కూటమిలో ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణ మీద సమీక్ష జరిగింది. సీఎం చంద్రబాబు కూటమి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగరాదని సీరియస్‌గా చెప్పినట్టు సమాచారం.ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎమ్మెల్యేలపై రిపోర్టు తెప్పించుకుని మరీ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా,మాజీ సీఎం జగన్ మాత్రం ఇప్పటివరకు మాజీ మంత్రులు, జిల్లాల ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో సమావేశం నిర్వహించలేదని తెలుస్తున్నది. దీనికి తోడు స్థానిక ఎన్నికలకు రెడీగా ఉండాలని కేడర్‌కు సైతం సంకేతాలు ఇవ్వలేదని తెలుస్తున్నది. దీనిని బట్టి వచ్చే ఎన్నికలపై వైసీపీ సీరియస్‌గా ఉన్నదా? లేదా? అని జోరుగా ప్రచారం జరుగుతోంది.